Roads: ఏదైనా ఆపద వస్తే త్వరగా ఆసుపత్రులకు చేరుకునేందుకు ఉపయోగపడాల్సిన పల్లె రహదారులు... ప్రమాదాలకే నిలయంగా మారాయి. అభివృద్ధి, మరమ్మతులకు నోచుకోక.. గుంతలమయంగా మారాయి. ఏ మాత్రం ఆదమరచినా మరుక్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో రోడ్ల పరిస్థితిపై పరిశీలనలో చాలా చేదు వాస్తవాలు వెలుగుచూశాయి.
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నక్కపేట పరిధిలోని పంచాయతీరాజ్ రహదారి ఇది. ఈ రోడ్డు.. పూర్తిగా ఛిద్రమైపోయి... భారీ గోతులు ఏర్పడ్డాయి. నక్కపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని జి.సిగడాం వెళ్లేదారిలో.. ఇటు నుంచి ఆ చివర వరకు ఎటు చూసినా గోతులే కనిపిస్తాయి. రోడ్డు ఆనవాళ్లే కనిపించడం లేదు. ఏ మాత్రం వేగంగా వాహనాన్ని నడిపినా.. గోతుల్లో పడి ప్రమాదాలకు గురికాక తప్పడం లేదు. విద్య, వ్యాపారం, ఉపాధి పనుల మీద రోజూ ఈ మార్గంలో ప్రయాణించేవారిలో ఎక్కువ మందికి వెన్నునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. నక్కపేట-పాలఖండ్యాం-జి.సిగడాం రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. నక్కపేట గ్రామస్థులు.. జి.సిగడాం వెళ్లాలంటే దగ్గరి దారి పది కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. నక్కపేట నుంచి టంకాల దుగ్గివలస వరకు అత్యంత దారుణంగా ఉండటంతో.. ప్రజలు, రైతులు, విద్యార్థులు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు..