శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యం ఉత్పత్తి చేసే మిల్లులు 48 ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చే బియ్యాన్నే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల సంస్థ తీసుకుంటోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి అక్కడి నుంచి బియ్యం దిగుమతి చేసుకుంటుంది. నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు వినియోగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వీటిని వెంటనే పంపిణీ చేసేందుకు వీలు లేదు. కనీసం ఆరు నెలల పాటు నిల్వ ఉంచాలి. మరోవైపు.. జిల్లాలో 336 రైస్ మిల్లులున్నాయి. ఇవన్నీ ఎఫ్‌సీఐకే సరఫరా చేయాలి. నిబంధనల మేరకు ఒక గిడ్డంగి 80 శాతం నిండితే గానీ.. కొత్త గిడ్డంగులు తీసుకోడానికి వీల్లేదు. ప్రైవేటు గిడ్డంగులకు చెల్లించే అద్దె భారాన్ని.. తగ్గించుకోడానికి రూపొందించుకున్న నిబంధనలివి.
ప్రస్తుతం ఆముదాలవలసలోని ఏఎంసీ గిడ్డంగికి.. కొన్ని మిల్లులను కేటాయించారు. మిల్లర్లందరూ అదే గిడ్డంగికి బియ్యాన్ని పంపిస్తున్న కారణంగా.. దిగుమతికి రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. అలాగే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములు జిల్లాలో 10 ఉన్నాయి. అన్నీట్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ క్రమంలో నిరీక్షణ కాలానికి సొమ్ములు చెల్లించాల్సి వస్తోందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.