ఊరించి.. ఉసూరుమనిపించిన జగన్ షుగర్ ఫ్యాక్టరీ హామీ.. Amadalavalasa Sugar Factory: విన్నారుగా జగనన్న ఎంత స్పష్టంగా చెప్పారో..! ఆమదాల వలస చక్కెర కర్మాగారాన్ని తెరిపించడం చంద్రబాబు సాధ్యం కాదంటున్నారు.. నేనొస్తే మళ్లీ తెరిపిస్తా అని తడుముకోకుండా చెప్పేశారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీల్లో ఇదీ ఒకటి..! జగన్ చెప్పినట్లే దేవుడి దయవల్ల ఆయన అధికారంలోకి వచ్చారు. జగన్ పక్కనే ఉండి చప్పట్లు కొట్టిన తమ్మినేని సీతారాం కూడా ఇప్పుడు స్పీకర్ అయ్యారు. కానీ.. ఇంతవరకూ ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోనేలేదు. కనీసం నాలుగేళ్లుగా.. ఆ ఊసేలేదు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు చేదు జ్ఞాపకంగా మిగిలిన జగన్ హామీ మిగిలిపోయింది.
పాదయాత్రలో జగన్‌ను అప్పట్లో ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ నేతలు కలిశారు. చక్కెర కార్మాగారాన్ని తెరిపించడం.. నాదీ పూచీ అంటూ.. అప్పట్లో తియ్యని మాటలు చెప్పిన జగన్.. ఇప్పుడు కనీసం పట్టించుకోవట్లేదని వారంతా ఆక్రోశిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస చక్కెర కర్మాగారానికి.. దశాబ్దాల చరిత్ర ఉంది. 1961 లో దీన్ని ఏర్పాటు చేశారు. వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షగా ఉపాధి కల్పించింది. దశాబ్దాలపాటు.. సహకార సంఘం ఆధ్వర్యంలో లాభాలు పండించించింది.
Referendum To Factory: ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ
కానీ.. అనుకోని నష్టాల కారణంగా 2004 సంవత్సరంలో మూతపడింది. చక్కెర కర్మాగారాన్ని అమ్మడానికి వీల్లేదంటూ అప్పట్లో రైతులు మహాజన సభలో తీర్మానం చేశారు. కానీ 2004లో బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థకు కర్మాగారాన్ని విక్రయించారు. కొందరు షేర్ హోల్డర్లు.. నాయస్థానాన్ని ఆశ్రయించారు. కర్మాగారాన్ని సహకార సంఘం ఆధ్వర్యంలో నడిపించాలని.. తీర్పు వచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో.. 2021 ఆగస్టులో కర్మాగారంపై కలెక్టర్ నివేదిక కూడా అందించారు. ఆ తర్వాత ఏమైందో ముఖ్యమంత్రి జగన్‌కు తప్ప మూడో కంటికి తెలియదంటున్నారు రైతులు. జగన్ ఇచ్చిన హామీకి విరుద్ధంగా.. తెరవెనుక తతంగం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమ పునః ప్రారంభించి ఇక్కడే ఉత్పత్తి చేయండి.. షుగర్ ...
ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని.. పునః ప్రారంభిస్తే అమదాలవలస, బూర్జ, పొందూరు, సంతకవిటి, సరుబుజ్జిలి, ఎల్ ఎన్ పేట, హిరమండలం, నరసన్నపేట, జలుమూరు, శ్రీకాకుళం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, పాతపట్నం.. ఇలా 15 మండలాల రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. జగన్ పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉంది. నాలుగేళ్లలో మిన్నకుండిపోయిన జగన్.. ఈ ఏడాదిలో ఏం చేస్తారని కార్మికులు నిట్టూరుస్తున్నారు.
"ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా.. ఇప్పటికీ దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇంకో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. కనీసం ఇప్పటికైనా షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే బాగుంటుంది." - స్థానికులు