ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అ'ధర్మాన'మంత్రి.. ధర్మాన ప్రసాదరావు, బర్తరఫ్ చేయని సీఎం జగన్ - Dharmana Prasada Rao Illegal assets

Revenue Minister Dharmana Prasada Rao: విశాఖలో భూ కుంభకోణంపై పకడ్బందీ ఆధారాలు సిట్‌ బయటపెట్టినా..మంత్రి ధర్మాన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానన్న ఊసే ఎత్తడం లేదు. పైపైచ్చు ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించకుండా ముఖ్యమంత్రి వెనకేసుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అవినీతి విషయంలో నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి చూపిన తెగువ..నేడు జగన్ చూపలేకపోవడం వెనక ఆంతర్యమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా విశాఖలో భారీగా భూ కుంభకోణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా...సంబంధిత రెవెన్యూ మంత్రి ధర్మాన నోరుమెదకపోవడం వెనుక తన భండారం బయటపడుతుందేనని భయం ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Revenue Minister Dharmana Prasada Rao
రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

By

Published : Dec 2, 2022, 8:18 AM IST

Updated : Dec 2, 2022, 12:29 PM IST

Revenue Minister Dharmana Prasada Rao Illegal assets: నాటి రాజకీయ నేతల్లో ఉన్న నిబద్ధత నేటి నాయకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. కొన్ని ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పట్లో పదవులనే త్యజించిన మహానాభావులు వారు. 1956లో మహబూబ్‌నగర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగి 112 మంది మృతిచెందగా..నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి రాజీనామా చేశారు. తర్వాత ప్రధాని నెహ్రూ సూచన మేరకు వెనక్కి తగ్గారు. అదే ఏడాది నవంబర్‌లో తమిళనాడులోని అరియలూరు వద్ద మరో రైలు ప్రమాదంలో 144 మంది మరణించడంతో ఈసారి ప్రధాని చెప్పినా వినకుండా పట్టుబట్టి లాల్‌బహదూర్‌శాస్త్రి రాజీనామా ఆమోదింపజేసుకున్నారు.

ఇది నాటితరం నాయకుల నిబద్ధత. నేటికీ రాజకీయ నాయకులకు ఇదొక పాఠంగా చెబుతుంటారు. కానీ ఇవేమీ ఒంటబట్టని మన నాయకులు వ్యక్తిగత అవినీతి ఆరోపణలు ఎదురైనా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. విశాఖలో వందల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడ్డారని, మంత్రి పదవి ద్వారా సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ విలువైన భూముల్ని కొట్టేశారని దర్యాప్తు బృందం నిగ్గు తేల్చినా..నిస్సిగ్గుగా పదవిని పట్టుకుని వేళ్లాడుతున్న నాయకుల గురించి భవిష్యత్‌ తరాలకు చెప్పాల్సి వస్తే మాత్రం..కచ్చితంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావునే గుర్తు చేసుకోవాలేమో..

భారీ కుంభకోణానికి పాల్పడ్డారని సిట్‌ ఆధారాలతో నిరూపించినా..ఇప్పటికీ ఎలాంటి సంకోచం లేకుండా ధర్మాన మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆయనను ఇంకా మంత్రివర్గంలో కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న కాలంలో ధర్మానా..విశాఖలో 71.29 ఎకరాల భూకుంభకోణానికి పాల్పడ్డారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి స్వాత్రంత్య్ర సమరయోధులకు కేటాయించిన డీ ఫాం పట్టా భూములకు ఎన్వోసీలు ఇప్పించి, వాటిని ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు కట్టబెట్టారని సిట్‌ తన నివేదికలో విస్పష్టంగా పేర్కొంది.

అయినా ధర్మానపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవడం లేదు..ఆయన్ను మంత్రివర్గం నుంచి భర్తరప్‌ చేయడం లేదు. కంచె చేను మేసిన చందంగా రెవెన్యూ మంత్రిగా ఉంటూనే భూములు కాజేసిన ధర్మానాపై చర్యలకు ముఖ్యమంత్రి ఉపేక్షించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. ఆధారాలతో కుంభకోణం బయటపడ్డా.. ఆయన నిర్వాకాన్ని సిట్‌ పేజీల కొద్దీ నివేదికలో ఎండగట్టినా ధర్మానకు చీమ కుట్టినట్టయినా లేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల కోసం పాటుబడుతున్న తనపై కావాలనే బురదచల్లుతున్నారని మంత్రి ధర్మాన అరోపించడమే కాదు..విశాఖలో ఒక్క భూమి విషయంలో నా ప్రమేయాన్ని నిరూపించినా ఆ భూములు రాసిస్తానంటూ సవాలు విసిరారు..కానీ ఆ భూములు అక్రమ మార్గాల్లో తన భార్య, కుమారుడి పేరు మీదకు, తమ్ముడు, సన్నిహితులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల్లోకి బదిలీ కాలేదని మాత్రం ఆయన నోటి నుంచి ఒక్కమాట రాదు. సిట్‌ నివేదికలో పేర్కొన్న అంశాలను మాత్రం ఖండిచలేదు.

విశాఖ భూ కుంభకోణాల్లో ప్రధాన సూత్రధారి మీరేనంటూ..ఎంతో చాకచక్యంగా పావులు కదిపి ఆ భూముల్ని హస్తగతం చేసుకున్నారని సిట్‌ సాక్ష్యాధారాలతో సహా నిరూపించినా..మంత్రి ధర్మానా మాత్రం ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు. తప్పును అంగీకరించి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సింది పోయి..ప్రశ్నించిన వారిపైనే ధర్మాన ఎదురుదాడికి దిగుతున్నారు.

విశాఖ భూ కుంభకోణంపై దర్యాప్తు చేసింది అప్పటి మంత్రుల బృందమో..సాదాసీదా అధికారులో కాదు..గ్రేహౌండ్స్‌ డీఐజీగా ఉన్న సీనియర్ వినీత్ బ్రిజ్‌లాల్‌, విశాఖ సంయుక్త కలెక్టర్‌ సృజన, డిప్యూటీ కలెక్టర్‌ విజయసారథి..కొన్నినెలలపాటు శ్రమించి, కొన్నివేల దస్త్రాలు పరిశీలించి, క్షుణ్ణంగా శోధించిన తర్వాతే వేల పేజీల నివేదిక రూపొందించారు.

ఇప్పటి వరకు భూ కుంభకోణాలపై అంత సాధికారికంగా, ఆధారసహితంగా, దోషులెవరో, వారి పాత్ర ఏమిటో సూటిగా, స్పష్టంగా చెప్పిన నివేదిక ఇంతకు మించింది లేదని..అధికార వర్గాలే అంటున్నాయి. విశాఖ గ్రామీణ, పరవాడ, మధురవాడ మండలాల్లో ధర్మాన కుటుంబం 71.29 ఎకరాల భూకుంభకోణానికి పాల్పడిందని, రెవెన్యూ మంత్రిగా ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సిట్‌ ఆధారాలతో సహా నిరూపించింది. విశ్రాంత సైనికోద్యోగులకు చెందిన ఎసైన్డ్‌ భూములకు నిరభ్యంతర పత్రాల కోసం వచ్చిన దరఖాస్తుల్ని ధర్మాన స్వయంగా ఎండార్స్‌ చేసి జిల్లా అధికారులకు పంపించారని..ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండటం వల్లే ఆ భూములకు ఎన్వోసీలు వచ్చాయని, సామాన్యులకు అలా ఎన్వోసీలు దక్కే ఆస్కారమే లేదని సిట్‌ పేర్కొంది.

మధురవాడలో మాజీ సైనికోద్యోగి మాదాబత్తుల అప్పారావు పేరిట ఉన్న ఐదు ఎకరాల డీ ఫాం భూమిని.. ధర్మాన స్వయంగా చెప్పడం వల్లే తాను కొన్నానని, తర్వాత ధర్మాన కుటుంబసభ్యుల పేరు మీద బదలాయించానని..గుబ్బల గోపాలకృష్ణ అనే వ్యక్తి సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. దానిలో తాను ఒక రూపాయీ పెట్టలేదని, తనకూ రూపాయీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ గోపాలకృష్ణ ధర్మానకు అత్యంత సన్నిహితుడు, ఆయన కుటుంబ కంపెనీలో డైరెక్టరు అయిన ఐబీ కుమార్‌కు స్వయంగా మామ. సొంత మనుషులు, అప్పట్లో ధర్మాన ప్రలోభపెట్టడం వల్లో, ఒత్తిడి తేవడం వల్లో కుట్రలో భాగస్వాములైనవారే ఏం జరిగిందో అంత స్పష్టంగా చెబితే.. ఇంకా బుకాయింపులు, హూంకరింపులతో ఎవరిని నమ్మించి మోసగించాలనుకుంటున్నారో ధర్మానకే తెలియాలి.

ప్రభుత్వ దర్యాప్తు బృందమే ఆధారాలతో సహా తప్పు జరిగినట్లు నిరూపించినా.... ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థంకావడం లేదు. ధర్మానపై చర్యలకు ఎందుకు తటపటాయిస్తున్నారో అంతుచిక్కని విషయం. వాన్‌పిక్, లేపాక్షి, పెన్నా సిమెంట్స్‌కు భూకేటాయింపుల కేసుల్లో సహనిందితుడైన ధర్మానను కేబినెట్‌ నుంచి బయటకు పంపించడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకున్నామని, తద్వారా ప్రభుత్వానికి 5వేల కోట్ల విలువైన సంపదను అందజేశానని ఊదరగొడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ధర్మాన అక్రమంగా హస్తగతం చేసుకున్న భూముల జోలికి ఎందుకు వెళ్లలేదని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.

వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన ధర్మాన, సబితాను అక్రమాస్తుల కేసులో నిందితులుగా సీబీఐ ఛార్జిషీట్‌లో నమోదు చేసింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వీరిద్దరితో వెంటనే రాజీనామా చేయించారు. కానీ విశాఖ భూకుంభకోణంలో మంత్రి ధర్మాన పాత్రపై ఆధారాలతో సహా సిట్‌ నివేదించినా..జగన్ చర్యలు చేపట్టడానికి వెనకాడుతుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంతో పోల్చుకుంటే విశాఖలో ఇప్పుడే భూ కుంభకోణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.యజమానులకు ఒకశాతం వాటా ఇచ్చి 99శాతం రాయించుకున్నారు బిల్డర్‌గా ఉన్న ఓ ప్రజాప్రతినిధి. విశాఖ నడిబొడ్డున కోట్ల విలువ చేసే దసపల్లా భూముల్ని వాటి యజమానులు అంటున్నవారికి 30 శాతం ఇచ్చి.. తాము 70 శాతం తీసుకునేలా ఒప్పందం చేసుకున్న అధికార పార్టీ నేతల బినామీలు మరికొందరు, చర్చి భూములకే ఎసరు పెట్టిన ప్రజాప్రతినిధి ఒకరు, అనకాపల్లి జిల్లా బయ్యవరంలో ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూముల్ని కొట్టేసిన అధికార పార్టీ ప్రబుద్ధులు మరికొందరు.

విశాఖలో ఇన్ని భూఅక్రమాలు జరుగుతున్నా..వాటిని కాపాడాల్సిన రెవెన్యూ మంత్రి ధర్మాన చోద్యం చూస్తున్నారే తప్ప కనీసం పట్టించుకోవడం లేదు. విశాఖ భూఅక్రమాలపై చర్యలకు ఉపక్రమిస్తే తన భూదందాల చిట్టా బయటకు తీస్తారన్న భయమో, ఉన్న పదవీ ఊడిపోతుందన్న ఆందోళనో తెలియదు గానీ ఆయన మాత్రం.. సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా కనీసం అక్కడేం జరుగుతోందని కూడా ఆరా తీయకపోవడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అ'ధర్మాన'మంత్రి.. ధర్మాన ప్రసాదరావు, బర్తరఫ్ చేయని సీఎం జగన్

ఇవీ చదవండి:

Last Updated : Dec 2, 2022, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details