తల్లీబిడ్డల మృతదేహాలతో బంధువుల రాస్తారోకో - child
చాపర పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ తల్లీబిడ్డ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. సవర బాణాపురం కూడలి పూండి రహదారిలో మృతదేహాలతో రాస్తారోకో నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సవర బాణాపురంలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున గర్భిణి కృష్ణవేణికి అస్వస్థతగా ఉందని చాపర పీహెచ్‌సీలో చేర్పించారు. గంటలో నార్మల్ డెలివరీ అవుతుందని వైద్యులు చెప్పారని కృష్ణవేణి భర్త అంటున్నారు. చివరకు అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో తల్లీబిడ్డ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని భర్త ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని మృతుల బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సవర బాణాపురం కూడలి పూండి రహదారిలో మృతదేహాలతో రాస్తారోకో చేశారు. ఈ ఘటనతో ఆ రహదారిలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది.