శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావుల వలస గ్రామానికి వెళ్లే మార్గంలో వంశధార కాలువపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కాలువ పై ఉన్న వంతెన ఈనెల 1న కుప్పకూలింది. 16వ నెంబర్ జాతీయ రహదారిపై నుంచి రావుల వలస గ్రామం వైపు వెళ్లే మార్గం మూతపడింది. కూలిన వంతెన వద్ద ఎటువంటి భద్రత సూచనలు, హెచ్చరికల వంటివి ఏర్పాటు చేయలేదు. రాత్రి సమయంలో ఈ మార్గం ద్వారా ప్రయాణించే ద్విచక్ర వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాలి నడకన వెళ్లే ప్రయాణికులు కాలువలోకి దిగి ప్రమాదకరంగా రాకపోకలు చేస్తున్నారు.
ఈ రహదారి అభివృద్ధి పనులకు కోటి 32 లక్షల నిధులు మంజూరయ్యాయి. రహదారి నిర్మాణ పనులను మంత్రి ధర్మాన కృష్ణ దాస్ కుమారుడు ప్రారంభించారు. ఇంతలోనే వంతెన కూలిపోయిన కారణంగా.. ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెనకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి సంబంధిత గుత్తేదారులకు నోటీసులు జారీ చేశామని పంచాయతీ రాజ్ పీఐయూఏ ఈ శంకర్రావు తెలిపారు.