తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో ఈనెల 17న జరిగిన న్యాయవాద దంపతులు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో హత్యకు గురైన నాగమణి స్వస్థలం రాజాం పట్టణం. ఈమె భర్త వామన్‌రావునూ దుండగులు పొట్టన పెట్టుకున్నారు. నాగమణి తండ్రి రమణమూర్తి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కాగా, తల్లి నాగమణి గృహిణి. సోదరుడు శ్రీనివాస్ జిల్లాలోని ఎచ్చెర్లలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగి. భర్త వామన్‌రావుతో కలిసి నాగమణి తెలంగాణ హైకోర్టు న్యాయవాదులుగా సేవలందిస్తున్నారు. ఈమె ఇంటర్ రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివారు. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఎల్‌ఎల్‌బీ పట్టా అక్కడే పొందారు. రంగారెడ్డి జిల్లాలో తండ్రి రమణమూర్తి ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సమయంలోనే వామన్‌రావుతో ప్రేమ వివాహం జరిగింది. బంధువుల శుభకార్యాలు, ఇతర వేడుకలు, పండగకు భర్తతో కలిసి రాజాంలోని కన్నవారింటికి వచ్చేవారు. సంఘటన తెలిసి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
టీవీల్లో చూసి ఏడుస్తూ వచ్చాం..