శ్రీకాకుళం జిల్లాలో..
ఆమదాలవలస మండలం కొత్త రోడ్డు వద్ద.. కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ.. దిల్లీలో అన్నదాతలు గత 45 రోజులుగా చేస్తున్న వీరోచిత పోరాటానికి సంఘీభావంగా సామాజిక న్యాయ పోరాట సమితి నిరసన కార్యక్రమం చేపట్టింది. కేంద్రంలో భాజపా రాజ్యాంగేతర శక్తిగా వ్యహరిస్తోందని.. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఫాసిస్టులా వ్యహరిస్తోందని సమితి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు, దేశానికి నష్టం చేసే విధంగా ఉన్న సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని.. లేనిపక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని వారు హెచ్చరించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో..
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా దెందులూరులో రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో నిరసన చేపట్టారు. అన్నదాతలకు, కౌలు రైతులకు, కూలీలకు ఇబ్బందికరంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కూడలి నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడలి వరకు ప్రదర్శన కొనసాగింది. నిరసన కార్యక్రమంలో దెందులూరుతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.