అత్తింటి వేధింపులు తాళలేక నిండు గర్భిణి.. రెండేళ్ల కుమారైతో సహా ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన వివాహిత బోనాల రాజేశ్వరి ఈ నెల 23న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మూడు రోజులుగా కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించగా.. నేడు సమీప గ్రామమైన చిన్న మురపాక సమీపంలో ఉన్న బావిలో రెండేళ్ల కుమారైతో సహా విగతజీవిగా కనిపించింది. ఏడు నెలల గర్భిణి అయిన రాజేశ్వరి అత్తింటి వేధింపుల కారణంగానే మృతి చెందినట్లు.. ఆమె పుట్టింటివారు ఆరోపించారు. అదనపు కట్నం కోసం మృతురాలి భర్త, అత్తమామలు వేధించేవారని తెలిపారు.
విషాదం: రెండేళ్ల కుమారైతో సహా నిండు గర్భిణి ఆత్మహత్య - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
ఏన్నో కలలతో అత్తింటిలో అడుగుపెట్టిన ఆమెకు నిత్యం వేధింపులే ఎదురయ్యాయి. అదనపు కట్నం తేవాలంటూ అత్తమామలు ఇబ్బందులకు గురి చేశారు. ఆదరించాల్సిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి నరకం చూపించాడు. మూడేళ్లగా అన్నింటిని భరించిన ఆమె.. ఎన్నాళ్లీ ఈ నరకం అనుకుందో ఏమో.. ఏడు నెలల గర్భిణి అయినప్పటికీ రెండేళ్ల బిడ్డతో సహా బావిలో దూకింది.
రాజేశ్వరి కనిపించడంలేదని గడిచిన మూడు రోజుల నుంచి లావేరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయటానికి వెళ్లినా పట్టించుకొలేదని వారు ఆరోపించారు. పోలీసులు స్పందించి ఉంటే తమ రాజేశ్వరి ప్రాణాలతో ఉండేదేమోనని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలు తమ్ముడు గన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసినట్లు లావేరు ఇంచార్జ్ ఎస్సై రాజేష్ తెలిపారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
ఇదీ చదవండీ..Corona cases: రాష్ట్రంలో కొత్తగా 4,458 కరోనా కేసులు, 38 మరణాలు