శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఎంపికలో గందరగోళం నెలకొంది. శుక్రవారం జరిగిన ఎన్నిక సమావేశంలో 12 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకావాల్సి ఉండగా... 10 మంది మాత్రమే హాజరయ్యారు. ఫలితంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో శనివారం స్వయంగా సభాపతి తమ్మినేని సీతారాం రంగంలోకి దిగారు. గోకర్ణపల్లి ఎంపీటీసీ సభ్యురాలు కిల్లీ ఉషారాణిని ఎంపీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వైస్ ఎంపీపీ అభ్యర్థిగా రాపాక -1 ఎంపీటీసీ అభ్యర్థి వండాన శ్రీదేవి పేరును ప్రతిపాదించడంతో... బురిడి కంచరాం ఎంపీటీసీ సభ్యుడు బొత్స రమణ అభ్యంతరం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంతో వాగ్వాదానికి దిగాడు. ఎంతోకాలం నుంచి పార్టీలో ఉండి, కష్టపడి పని చేస్తున్నానని.. పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ... ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడింది.