శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. తెదేపా ఎన్నికల్లో పాల్గొనకపోవడంతో పోలింగ్ శాతం అరకొరగా కనిపిస్తోంది. ఓటర్లు స్వల్పంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
టెక్కలి నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 8.30 గంటల వరకు చాలా కేంద్రాల్లో పెద్దగా ఓటర్ల జాడ కనిపించలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటర్ల రాక కోసం సిబ్బంది ఎదురుచూస్తున్నారు. పలుచోట్ల కొవిడ్ నిబంధనలు అమలుకు నోచుకోలేదు.
నరసన్నపేటలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు కేవలం 2 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. ఓటర్లు రాక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి.
సంతకవిటి మండలం తాలాడలో నిర్ణీత సమయానికి గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలైంది.ఎన్నికల అధికారుల దగ్గరున్న ఓటరు జాబితాకు.. ఓటర్లకు పంచిన స్లిప్పులకు వ్యత్యాసం ఉండడంతో గందరగోళం తలెత్తింది. పోలింగ్‌ను తాత్కాలికంగా ఆపారు. కాసేపటి తర్వాత ఎన్నికల అధికారుల వద్ద ఉన్న ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నిక జరపాలని నిర్ణయానికి వచ్చారు. వీరఘట్టంలోనూ ఓటర్లకు ఇచ్చిన స్లిప్పులకు.. పోలింగ్ అధికారుల వద్ద ఉన్న జాబితాకు వ్యత్యాసం ఉండడం గందరగోళం తలెత్తింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు చాలాసేపు వేచి ఉండి.. వెనుదిరిగారు.
ఇదీ చదవండి:తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది: చంద్రబాబు