శ్రీకాకుళం జిల్లా సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాలాడ గ్రామానికి చెందిన పాత నేరస్థుడు సూర్యనారాయణ యాసిడ్ తాగాడు. పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఓ చోరీ కేసులో సూర్యనారాయణను విచారణ చేస్తున్న సమయంలో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.
మండవకురిటిలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు గస్తీ నిర్వహించిన సమయంలో పాత నేరస్థుడైన కుప్పిలి సూర్యనారాయణ లేకపోవటంపై.. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఆ సమయంలో బాత్రూమ్కు వెళ్తానని చెప్పి, అక్కడ ఉన్న మిక్స్ క్లీనింగ్ యాసిడ్ తాగిన సూర్య నారాయణ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులను భయపెట్టేందుకే సూర్యనారాయణ ఈ ఘటనకు పాల్పడ్డాడని సీఐ శ్రీనివాసులు ఆరోపించారు.