PDF MLC Venkateswara Rao Comments: రాష్ట్రంలోని పాఠశాల విద్యా విధానంలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో.. ఆదివారం నిర్వహించిన సంక్షేమరాజ్యం - పెన్షన్ విధానం అంశంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాలుగేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, పింఛనుదారులకు చేసిన మేలేమిటని ప్రశ్నించారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు, సకాలంలో డీఏలు చెల్లింపు హామీ ఏమైందని నిలదీశారు. 2019- 24 మధ్య చెల్లించాల్సిన డీఏలు 30 ఏళ్ల తర్వాత పరిపాలనకు వచ్చేవారు చెల్లిస్తారనడంలో ప్రభుత్వ నైతికత, నిజాయితీని ప్రశ్నించారు.
పాఠశాల మూతపడదు, ఉపాధ్యాయ పోస్టు రద్దవదు అని నాడు చెప్పి.. నేడు నూతన విద్యా విధానం నెత్తికెక్కించుకుని విలీనాలు చేసి పాఠశాల విద్యా వ్యవస్థను నీరుగార్చారన్నారు. విద్యార్థులు ప్రభుత్వ బడులనుంచి ప్రైవేటుకు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఓపీఎస్ మాట మర్చిపోయిందని, హామీల అమలుకు పోరాడుతున్న ఉపాధ్యాయులపై జీవో నంబరు 1తో నిర్బంధ చర్యలకు పూనుకోవడం బ్రిటీష్ పాలనను తలపిస్తోందని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రతిఘటన తీవ్రతరమవుతుందని స్పష్టంచేశారు.