కడ శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో పవన్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి.. ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగం ప్రారంభించారు. ఇప్పుడున్న నాయకులు యువత గురించి ఆలోచించట్లేదని, వారి బిడ్డల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని విమర్శించారు.
‘‘సినిమాలు చేస్తున్నా.. నా మనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించే ఆలోచించింది. నేను సగటు మధ్య తరగతి మనిషిని, సామాన్యుడిని. నా కోసం తొలి ప్రేమ, ఖుషి సినిమాల వరకే పోరాటం చేశా. సినిమాల విజయం ద్వారా నాకు ఆనందం కలగలేదు.. సామాన్యుల కష్టం నన్ను ఆనందంగా ఉండనివ్వలేదు. నాయకుల నిజ వ్యక్తిత్వాలు నాకు చిరాకు, బాధ కలిగించాయి. రాష్ట్ర విభజన జరిగిన తీరు చూసి బాధ కలిగింది. పార్టీ పెట్టినప్పుడు నా పక్కన ఎవరూ లేరు. ఈరోజు ప్రతీ సన్నాసితో తిట్లు పడుతున్నా బాధ కలగట్లేదు. సాటి మనుషుల కోసం జీవించడం గొప్ప విషయంగా భావిస్తున్నా. శ్రీకాకుళం గొప్పతనానికి గిడుగు రామ్మూర్తి జీవితమే నిదర్శనం. శ్రీశ్రీ కవిత్వం, రావిశాస్త్రి, చాసో రచనలు స్ఫూర్తినిచ్చాయి. ఉత్తరాంధ్ర పోరాటగడ్డ.. కళింగ ఆంధ్ర కాదు.. కలియబడే ఆంధ్ర. నేను గెలుస్తానో? ఓడుతానో? తెలియదు.. కానీ, పోరాటమే తెలుసు. గూండాలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావని విమర్శిస్తుంటే ఏ రోజూ నేను బాధపడలేదు. ప్రజల తరఫున పోరాడుతుంటే చట్ట సభల్లో పోరాడే సత్తా నాకు గత ఎన్నికల్లో ఇవ్వలేదు. కానీ, అవన్నీ పోరాటంలో గాయాలుగా భావించా. జాషువా విశ్వనరుడివైపు పయనించే వ్యక్తిని నేను. చాలా సుఖాలు చూశా వాటిపై నాకు మమకారం లేదు.
కడ శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటా..: రణస్థలంలో మాట ఇస్తున్నా.. కడ శ్వాస వరకు రాజకీయాలను వదలను. పూర్తి స్థాయి రాజకీయ నాయకులం అని కొందరు చెబుతారు. ఈ దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు? అందరూ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తూనే రాజకీయాల్లో ఉన్నారు. కపిల్ సిబల్, చిదంబరం లాంటి వారు కూడా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే రాజకీయాల్లో ఉన్నారు. అందుకే నేను కూడా రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నా. పార్టీని నడిపేంత డబ్బు వస్తే సినిమాలు వదిలేందుకు సిద్ధం. ఇది మూడు ముక్కల ప్రభుత్వం.. తను 3 ముక్కల సీఎం. మాట్లాడితే.. 3 పెళ్లిళ్లు అంటున్నారు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి. నేను ముగ్గురికీ విడాకులు ఇచ్చి చేసుకున్నా. మీ నాన్న వైఎస్‌నే ఎదుర్కొన్నా.. నువ్వెంత? పంచెలూడదీసి కొడతానని అప్పట్లోనే సవాల్ చేశా. అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా. చిన్న వయసులోనే తీవ్రవాదం వైపు వెళ్లాలనుకుని ఆగిపోయా. ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతానని గతంలోనే చెప్పా. నా చేతికి అందుబాటులోకి వచ్చి ఎవడైనా ప్యాకేజీ అంటే.. ఏం చేస్తానో చూడండి. సంబరాల రాంబాబూ పిచ్చి కూతలు ఆపండి. నేను బతికున్నంత వరకూ యుద్ధం చేస్తూనే ఉంటా. కులం మద్దతివ్వకపోయినా ఫర్లేదు.. కానీ, కులాల మధ్య చిచ్చుపెట్టి గెలవాలనుకోవట్లేదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
మీకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం..:‘‘సీఎంకు గ్యాంబ్లింగ్ పిచ్చి అని ఈ మధ్యే తెలిసింది. ఖైదీ నంబర్ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా? నేను ఉత్తరాధ్ర వెనుబాటుతనాన్ని రూపుమాపుతా. ఉత్తరాంధ్ర వలసలు ఆపుతా, అభివృద్ధి చేస్తా. యువకులారా... మీ కోసం నేను తిట్లు తింటున్నా. మీరు నన్ను నమ్మితే మీ సమస్యలు తీరుస్తా. ఉత్తరాంధ్రలో అభివృద్ధి అవకాలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఉత్తరాంధ్ర సమస్యల గరించి మాట్లాడే వారే లేరు. మీకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం. సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుంది. సలహాలిచ్చేది సజ్జల అయితే రాజ్యం పూర్తిగా నాశనం అవుతుంది. ఒక నేత ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం సాధిస్తానంటున్నారు. మీకు పదవులు లేకపోతే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా? ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇస్తే అప్పడంలా నమిలేస్తారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామంటే .. మిమ్మల్ని ముక్కలు చేస్తాం. ధర్మానా.. 1280 ఎకరాలు తాకట్టు పెడితే మీ ఉత్తరాంధ్ర ప్రేమ ఏమైంది. జనసైనికులు కేవలం నినాదాలిస్తే సరిపోదు.. పోలింగ్ రోజు ఓటు వేసే వరకు ఆ కసి ఉండాలి. నినాదాలతో పనికాదు.. ఓట్లతోనే మార్పు. గత ఎన్నికల్లో చట్ట సభల్లో పోరాడే శక్తి ఇవ్వలేదు. అందుకే ప్రజా క్షేత్రంలో పోరాడుతున్నా. రెండో చోట్లా ఓడిపోయానని ఆ డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతున్నారు. మీకోసం చివరికి డైమండ్ రాణీతో కూడా తిట్లు తింటున్నా. వైకాపాకు 30 మంది ఎంపీలు ఉండి ఏం ప్రయోజనం. జనసేనకు 10మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా బలంగా పోరాడే వాడిని. ‘బీమ్లానాయక్’ రిలీజ్ అపితే రూ.30కోట్లు నష్టం వస్తే భరించ లేదా? ’’ అని పవన్ పేర్కొన్నారు.
జనసేన అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రను ఆర్థిక రాజధానిగా చేస్తామని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. జాలర్లు పాకిస్థాన్ వెళ్లే అవసరం లేకుండా చేస్తానన్నారు. గంజాయి సాగుచేసే పరిస్థితుల నుంచి బయటకు తీసుకువస్తానన్నారు. వైకాపా ఆఫీస్‌గా మారిన ఆంధ్ర వర్సిటీని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు.
సీఎంను కావాలని నేను కోరుకుంటే కాను.. మీరు చేస్తే అవుతాను. ఏడాదికి రూ.250 కోట్లు సంపాదించగలను. నా ఒకరోజు సంపాదన కోటి రూపాయలు. కోటి మంది ప్రజల కోసం కోట్లు వదులుకోవడానికి సిద్ధం. పార్టీ నడిపేందుకు మీ నుంచి విరాళాలు కావాలి. మీరు ఇచ్చిన ఒక్క రూపాయి కూడా దగా చేయను. దగా చేయను.. మోసం చేయను.. బాధ్యతగా ఉంటా. -పవన్‌కల్యాణ్
ఇవీ చదవండి: