ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతన్నల రెక్కల కష్టం.. ఆదుకోని ప్రభుత్వం - శ్రీకాకుళం జిల్లా వార్తలు

అన్నదాత ఆరుగాలం శ్రమించిన కష్టానికి ప్రతిఫలం చేతికొచ్చింది. పంట బాగుందని మురిసిపోయిన రైతన్నలకు ఇప్పుడు దానిని అమ్ముకోవడమే పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో వారికి అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల అధికారులు పట్టించుకోకపోవడం కారణమైతే.. మరికొన్నిచోట్ల ధాన్యం కొనలేమని మిల్లర్లే చేతులెత్తేస్తున్న దుస్థితి. ఇదే అదనుగా మధ్యవర్తులు.. రైతన్నల రెక్కల కష్టాన్ని తక్కువ ధరకే దోచుకుంటున్నారు. ఈ పరిణామాల నడుమ పంట విక్రయానికి శ్రీకాకుళం జిల్లాలో రైతులు పడుతున్న అవస్థలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

paddy farmers face severe procurement problems in srikakulam
రైతన్నల రెక్కల కష్టం.. ఆదుకోని ప్రభుత్వం

By

Published : Mar 15, 2021, 1:15 PM IST

రైతన్నల రెక్కల కష్టం.. ఆదుకోని ప్రభుత్వం

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ధాన్యం తీసుకునే ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మిల్లుకు ధాన్యాన్ని తీసుకెళ్తున్న రైతులకు ఇబ్బందులే తలెత్తుతున్నాయి. తేమ శాతం ఇతరత్రా కారణాలు చూపి ధర తక్కువ కడుతున్నారు మిల్లర్లు. ఈ విషయమై అన్నదాతలు గట్టిగా ప్రశ్నిస్తే.. బ్యాంకు గ్యారెంటీ అయిపోయిందని చెప్పి మొహం చాటేస్తున్నారు. ఇక కొనలేమంటూ వెనక్కి పంపిస్తున్నారు. జిల్లాలో 10.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే.. ప్రభుత్వం 7.02 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. పొలాల్లోనే వరి కుప్పలు ఇంకా ఉండి పోయాయి. అమ్ముకునే దారిలేక అన్నదాత అవస్థలు పడుతున్నారు.

పొరుగు రాష్ట్రం నుంచి తక్కువ ధరకు ధాన్యం సరఫరా

ఖరీఫ్‌ పంటను కోసి కుప్పలుగా వేసిన రైతులు.. అపరాల విత్తనాలు చల్లారు. తర్వాత కుప్పలు తీసి నూర్పిడి ప్రారంభించారు. అప్పటికే కొందరు మిల్లర్లు పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి తక్కువకు ధరకు కొన్న ధాన్యాన్ని తీసుకొచ్చేశారు. జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభమవుతున్న తరుణంలో ఒడిశా నుంచి వచ్చే ధాన్యం లారీలను రెవెన్యూ అధికారులు రాష్ట్ర సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నారు. చాలారోజులు వాటిని విడిచిపెట్టలేదు. పొరుగు రాష్ట్రం నుంచి దిగుమతులపై ఆంక్షలు విధించారు.

గుట్టుచప్పుడు కాకుండా...

ఈసారి జిల్లాలో పండిన పంటను నూరు శాతం గిట్టుబాటు ధరకు కొంటారని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. మొదట్లో పట్టు బిగించిన అధికారులు.. తర్వాత రాష్ట్రస్థాయి నాయకులు, అధికారుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా వాటిని విడిచిపెట్టారు. ఆ తర్వాత నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా నుంచి కొన్ని మిల్లులకు ధాన్యం దిగుమతి అవుతూనే ఉంది. ఫలితంగా జిల్లా రైతుల నుంచి 80 శాతం పంట కొనేసరికి కొన్ని మిల్లుల వద్ద నిల్వలు పెరిగిపోయాయి.

ఎక్కడ చూసినా వరి కుప్పలే...

పొలాల్లో ఎక్కడికక్కడే ధాన్యం బస్తాలు దర్శనమిస్తున్నాయి. నూర్పిడి చేస్తే కాపాడుకోవడం కష్టమని భావించి.. చాలామంది కుప్పలుగా పొలాల్లోనే ఉంచేశారు. ఆముదాలవలస మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో.. పొలాల్లో ఎక్కడ చూసినా కుప్పలుతో పాటు ధాన్యం బస్తాలే దర్శనమిస్తున్నాయి.

రైతులకు ఆశ చూపుతున్న మధ్యవర్తులు

మిల్లర్లు, అధికారులు చెబుతున్న కారణాలతో.. పొలాల్లో ఉండిపోయిన పంట మధ్యవర్తులకు కాసులు కురిపిస్తోంది. ఇక ప్రభుత్వం కొనదని, ఒకవేళ కొన్నా డబ్బులు సకాలంలో చెల్లించదని.. మధ్యవర్తులు రైతులను నమ్మిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పంటను కాస్త తక్కువ ధర అయినా తాము కొంటామని నమ్మబలుకుతున్నారు. వారి మాటలకు లొంగిపోతున్న రైతన్నలకు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర అందని ద్రాక్షలాగే మిగిలిపోతోంది.

ఆసక్తి చూపని మిల్లర్లు

కొందరు మిల్లర్లు కూడా నేరుగా రైతుల నుంచి కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మధ్యవర్తుల ద్వారా అయితే ఎలాంటి అడ్డంకులూ లేకుండా తీసుకుంటున్నారు. ఈ పరిణామాలే అటు రైతులకు నష్టాల్ని, మధ్యవర్తులకు లాభాల్ని తెచ్చిపెడుతున్నాయి.

రైతులు అధైర్యపడొద్దు: కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లు చాలా వరకూ పూర్తిచేశామని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. కేవలం వీరఘట్టం, పాలకొండ, వంగర, బూర్జ, ఆమదాలవలస తదితర మండలాల్లో రైతులు ఇప్పుడే నూర్పిళ్లు చేస్తున్నారు. ఆయా రైతుల ధాన్యాన్నీ కొనుగోలు చేయడానికి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు కూడా వాటిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని.. ప్రతి గింజ కొంటామని భరోసానిచ్చారు. మొదట్నుంచీ అధికారులు దృష్టి సారించకపోవడంతో.. ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకg కనీసం 50 శాతం ధాన్యాన్ని కొనలేదని ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ.. వైకాపాదే!

ABOUT THE AUTHOR

...view details