ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో మిగిలిన తొమ్మిది మండలాల్లోనూ పల్లెపోరు ముగిసింది. ఈ ప్రక్రియలో ఏకగ్రీవాల కోసం నేతలు గట్టి ప్రయత్నాలు చేశారు. బరిలో నిలవాలనుకున్న అభ్యర్థులను వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో బెదిరింపులు, బుజ్జగింపులు, ప్రలోభాలతో పోటీ నుంచి తప్పుకొనేలా చేశారు. వేసిన నామపత్రాన్ని కూడా ఉప సంహరించుకునేలా చేశారు. వీరిలో గ్రామస్థులంతా కలిసి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడిన వారు కొందరైతే బెదిరింపులు, ప్రలోభాలకు తలొగ్గి వెనక్కి తగ్గారు. అయినా ఈసారి ఏకగ్రీవాలు తక్కువగానే నమోదయ్యాయి. గతంలో జిల్లా మొత్తం 204 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైతే ప్రస్తుతం 140 మాత్రమే అయ్యాయి. వార్డుల్లోనూ ఇదే పరిస్థితి.
అభివృద్ధికే ఆ నిధులు!..
అప్పట్లో ఏకగ్రీవాలైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చింది. కానీ 15 వేల కంటే ఎక్కువ జనాభా ఉండి ఏకగ్రీవమైన వాటికే అవి దక్కాయి. మిగిలిన వాటికి మొండిచేయి చూపింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధిత పంచాయతీ మొత్తం జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకాలు ప్రకటించింది. జిల్లాలో ఏకగ్రీవాల్లో రెండు వేల లోపు జనాభా కలిగినవే దాదాపు 119 ఉన్నాయి. రెండు వేల నుంచి 5 వేల మధ్య జనాభా గల గ్రామాలు 21 ఉన్నాయి.