శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. తల్లీకూతుళ్లపై హత్యాయత్నం Land Occupied in Srikakulam : శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో తమ కుటుంబానికే చెందిన ఇద్దరు మహిళలపై కొందరు ట్రాక్టరుతో కంకరమట్టి పోయించడం సంచలనమైంది. బాధితుల కథనం ప్రకారం... కుటుంబానికి చెందిన ఆస్తుల్లో తమకు న్యాయబద్ధంగా వాటా ఇవ్వాలని హరిపురానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రి పోరాడుతున్నారు.
ఈ క్రమంలో స్థానిక హెచ్‌బీ కాలనీ సమీపంలో రహదారి పక్కన ఉమ్మడి ఆస్తి ఇంటి స్థలంలో దాలమ్మ భర్త నారాయణ అన్న కుమారుడు కొట్ర రామారావు కొద్ది రోజుల నుంచి ట్రాక్టర్లతో కంకరమట్టి తోలిస్తున్నారు. ఆ స్థలంలో తమకూ వాటా ఉందంటూ తల్లీకుమార్తె సోమవారం అక్కడికి వెళ్లారు. ట్రాక్టరుతో కంకరమట్టి వేస్తుండగా అభ్యంతరం తెలిపారు. మట్టి పోయకూడదంటూ ట్రాక్టరు వెనుక వైపునకు వెళ్లి కింద కూర్చున్నారు. అయినా పట్టించుకోకుండా వారిపై మట్టిని అన్‌లోడ్ చేశారు. మట్టిలో కూరుకుపోయిన తల్లీకుమార్తె విలవిల్లాడారు. కాపాడాలని కేకలు వేస్తూ రోదిస్తుండటంతో సమీపంలో ఉన్న కొందరు యువకులు వారిని బయటకు తీశారు.
కుటుంబానికి చెందిన ఆస్తిలో తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా అడుగుతున్నామని, కక్షగట్టి కొట్ర రామారావు, కొట్ర ఆనందరావు, కొట్ర ప్రకాశరావు (వీరు దాలమ్మ భర్త నారాయణ సోదరులు సీతారాం, లక్ష్మీనారాయణ కుమారులు) తమపై మట్టి కప్పించి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు మందస పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొట్ర రామారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
భర్త కొట్ర నారాయణ మృతి చెందడంతో భార్య దాలమ్మ, ఆమె కుమార్తె సావిత్రి ఉమ్మడి ఆస్తుల్లో వాటా కోసం 2019 నుంచి పోరాడుతున్నారు. నారాయణ ఇద్దరు అన్నదమ్ములు సీతారాం, లక్ష్మీనారాయణతో సమానంగా తమకూ ఆస్తి ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ఇందుకోసం గతంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే హోదాలో సీదిరి అప్పలరాజు కలగజేసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. దాలమ్మ బావ సీతారాం కుమారుడైన వైకాపా గ్రామ నాయకుడు కొట్ర రామారావు అదే గ్రామంలోని ఓ స్థలంలో కొద్ది రోజులుగా భవన నిర్మాణానికి పునాదులు తీసి అందులో కంకరమట్టి వేయిస్తున్నారు. ఆ స్థలంలో తమకూ వాటా ఉందని దాలమ్మ, సావిత్రి అడ్డుకోగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇవీ చదవండి: