రోజు రోజుకూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో వరదల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గి.. సరఫరాలో ఉన్న ఉల్లి ధరలు అమాంతం కొండెక్కాయి. ఈ ప్రభావంతో ఉల్లి సరఫరాల పూర్తిగా కర్నూలు మార్కెట్ యార్డ్‌పై ఆధారపడాల్సి వస్తుంది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి వంద రూపాయలు పలుకుతోంది. ఈ కారణంగా సామాన్యులు ఉల్లిని కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలు పెరగటం వలన ప్రభుత్వం కిలో ఉల్లి 25 రూపాయలకు రాయితీపై అందిస్తుంది. శ్రీకాకుళంలోని మూడు మార్కెట్ యార్డ్‌లలో రాయితీ ఉల్లిని సరఫరా చేస్తున్నారు. ఉల్లి కోసం వినియోగదారులు బారులు తీరుతున్నారు.
కృత్రిమ కొరతతో..
శ్రీకాకుళం జిల్లాకు కర్నూలు, తాడేపల్లిగూడెం, నాసిక్, బళ్లారి ప్రాంతాల నుంచి ఉల్లి లోడులు వస్తాయి. ప్రస్తుతం కర్నూలు నుంచి మాత్రమే ఉల్లి సరఫరా అవ్వడం వలన డిమాండ్‌లో అసమానతలు ఏర్పడ్డాయి. అధికారులు నిర్లక్ష్యంతో అందుబాటులో ఉన్న ఉల్లిని వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధరలు నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడం వలన ...ఉల్లిని కోయకుండానే వినియోగదారుని కంట కన్నీరు తెప్పిస్తోంది. ప్రభుత్వం రాయితీకే ఉల్లిని అందించినప్పటికీ ... అవి వినియోగదారుణ్ని చేరాలంటే గంటల తరబడి లైన్లలో నిరీక్షించాల్సిందేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.