శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సాగునీటి వనరులైన వంశధార, నాగావళి నదులను అనుసంధానించేందుకు.. 2017లో నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు చకాచకా జరిగినా.. ప్రస్తుతం నత్తతో పోటీపడుతున్నాయి. వర్షాకాలం మినహా నాగావళి నదిలో ఎప్పుడూ నీళ్లు ఉండవు. ఆ నదికి ఎగువన తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్లు ఉన్నా అక్కడి అవసరాలు తీరితే గానీ, దిగువకు నీళ్లు రావు. ఫలితంగా నాగావళి నది జిల్లాలో ఎప్పుడూ నిండుగా పారింది లేదు. దీనిపై ఆధారపడిన ఆయకట్టు ఎప్పుడూ ఇబ్బందుల్లో పడుతూనే ఉంది. వంశధారతో నాగావళి అనుసంధానం ఓ కొలిక్కి వస్తే.. నారాయణపురం ఆనకట్ట కింద 7 మండలాల పరిధిలోని 37 వేల 5 వందల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు అనుసంధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీల వల్ల కొత్తగా మరో 5 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. అయితే ఈ అనుసంధానం వల్ల తమ ప్రాంతం ముంపునకు గురవుతుందని బూర్జ మండలం రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూ వివాదాలు
నిర్మాణ పనులు కొంతవరకూ సజావుగానే సాగినా, అక్కడక్కడా అడ్డంకులు పడుతూనే ఉన్నాయి. పరిహారం చెల్లిస్తేనే గాని తమ పొలంలో కాల్వ పనులు ప్రారంభించడానికి వీల్లేదంటూ కొందరు రైతులు అడ్డుకోవడంతో కొంత వరకూ పనులు నిలిచిపోయాయి. మరోచోట భూవివాదం కోర్టు పరిధిలో ఉన్నందున పనులు ఆగాయి. ఏటా కురిసే భారీ వర్షాలతో తమ పంటలు ముంపునకు గురవుతున్నాయని లాభం, లంకాం సహా నదీ పరీవాహక ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనికి పరిష్కారంగా వయోడెక్ట్ నిర్మించాలని కోరుతున్నారు.