'రాష్ట్రానికి వచ్చేలోపు చనిపోయేలా ఉన్నాం' - ఉత్తరాంధ్ర మత్స్యకారులు
ఈ నెల 28న గుజరాత్ నుంచి రాష్ట్రానికి బయలుదేరిన మత్స్యకారులు ఆకలి కేకలు పెడుతున్నారు. తమకు ఇప్పటివరకు భోజనం పెట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకో మిక్చర్ ప్యాకెట్, మూడు వాటర్ ప్యాకెట్లు ఇచ్చి కడుపు నింపుకోమంటున్నారని దీనంగా చెబుతున్నారు. వారి కష్టాలను ఓ వీడియోలో చెప్పుకున్నారు.
గుజరాత్‌లోని వేరావల్ నుంచి ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు బయల్దేరిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఆకలితో అల్లాడిపోతున్నారు. 28వ తేదీ సాయంత్రం నుంచి ఇప్పటివరకు వారికి ఎలాంటి ఆహారం అందివ్వలేదు. మిక్చర్ పొట్లాలు ఇచ్చి వాటితోనే కడుపు నింపుకోమని చెబుతున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూటకు ఓ చిన్న వాటర్ ప్యాకెట్ మాత్రమే ఇస్తున్నారని... దానితోనే దాహం తీర్చకోముంటున్నారని వాపోతున్నారు. రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి 3,500 రూపాయలు తీసుకుని కనీసం భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు. ఇద్దరికి సరిపోయే స్థలంలో నలుగురుని కూర్చోబెట్టారని ఆరోపించారు. ఆకలి తీర్చకపోతే తమకు చాలా కష్టమని.. రాష్ట్రానికి వచ్చేలోపు చనిపోతామేమోనన్న భయం ఉందని అంటున్నారు.