ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 7, 2020, 2:28 PM IST

ETV Bharat / state

ఆ రెండు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదు!

రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నప్పటికీ.. రెండు జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కొవిడ్ కేసు నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు రాలేదు. దీనిపై పలు విశ్లేషణలు వస్తున్నాయి.

no corona cases in srikakulam vizianagaram districts
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా కేసుల్లేవ్

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు వెలుగు చూసినప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్కటీ నమోదు కాలేదు. దీనిపై పలు విశ్లేషణలు వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారు తక్కువగా ఉండటం ఇప్పటివరకు కొనసాగుతున్న ఆరోగ్య వాతావరణానికి దోహదపడిందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దిల్లీలో నిర్వహించిన తబ్లిగ్‌ జమాత్‌ సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి నామమాత్రంగానే ముస్లింలు వెళ్లడం కూడా ఓ కారణంగా అభిప్రాయపడుతున్నారు. వారిలోనూ చాలామంది క్వారంటైన్‌ నిబంధనలను పాటించారని విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో అత్యధిక శాతం విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి సంబంధించినవేనని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వీరితో పాటు జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి వ్యాధి సోకిందని చెబుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో..

దిల్లీలో జరిగిన తబ్లిగ్‌ జమాత్‌ సదస్సుకు ఈ జిల్లా నుంచి ఎవరూ వెళ్లలేదు. అయితే ఈ సదస్సుకు హాజరైన వారు తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణించిన రైలు బోగీలో ఈ జిల్లాకు చెందిన 18 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో 12 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. మిగతా ఆరుగురు జిల్లాకు రాకుండా వేర్వేరు ప్రాంతాల్లో దిగినట్లు విచారణలో వెల్లడైంది. వారి వివరాలను ఆయా జిల్లాల యంత్రాంగానికి పంపారు.

* విదేశాల నుంచి జిల్లాకు మొత్తం 1,445 మంది రాగా.. వారందరినీ హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షించారు. 1,269 మందికి సంబంధించి 14 రోజుల హోమ్‌ క్వారంటైన్‌ గడువు ముగిసింది. మిగిలిన 176 మంది క్వారంటైన్‌ సమయం ఇంకా పూర్తి కాలేదు. మొత్తంగా ఇప్పటివరకూ 116 మంది అనుమానితుల నమూనాలను కాకినాడకు పంపించారు. 102 నమూనాల్లో ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. మరో 14 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

విజయనగరం జిల్లాలో..

* తబ్లిగ్‌ జమాత్‌ సదస్సుకు ఈ జిల్లా నుంచి ముగ్గురు మాత్రమే వెళ్లారు. వీరి నమూనాలను పరీక్షలకు పంపించగా ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి.

* కరోనా అనుమానిత లక్షణాలున్న 17 మంది నమూనాలను రోగనిర్ధారణ పరీక్షల కోసం కాకినాడకు పంపించారు. 14 నమూనాలకు సంబంధించి నెగెటివ్‌ ఫలితాలు వచ్చాయి. మరో మూడింటి ఫలితాలు రావాల్సి ఉంది.

ఇవీ చదవండి:

విజృంభిస్తున్న కరోనా... ప్రభుత్వం కీలక ఆదేశాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details