చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని విత్తనాభివృద్ధి సంస్థ.. ఖరీఫ్ రైతులకు వరి, వేరుశనగ విత్తనాలను అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో ప్రణాళిక సిద్ధం చేసింది. వరి, విత్తన సేకరణకు శ్రీకారం చుట్టిన సంస్థ ఈ దఫా వేరుశనగ రైతుల నుంచి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసేందుకు సంకల్పించింది. 70 వేల క్వింటాళ్ల మేరకు ధ్రువీకరించిన విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించుకుంది.
ఇప్పటికే రబీలో పండించిన ధాన్యం సేకరించేందుకు సిద్ధమైంది. ప్రధానంగా ఏడీ టీ37, బీపిటీ 5204, ఏడీటీ 39 జ్యోతి, ఆర్ఎన్ఆర్ 15048, తదితర రకాలను సేకరిస్తున్నారు. సేకరించిన విత్తనాల విక్రయాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ప్రధానంగా తమిళనాడులోని పలు ప్రాంతాల రైతులు ఇక్కడ విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. అదేవిధంగా వేరుశెనగలో కే6 రకాన్ని కిలో రూ.64 వంతున కొనుగోలు చేసి విత్తన శుద్ధి కేంద్రాలకు తరలిస్తున్నారు. 60 వేల క్వింటాలు లక్ష్యంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సేకరించిన వేరుశెనగను పీలేరు, నాగలాపురం, నిమ్మనపల్లికి తరలించి విత్తన శుద్ధి చేయడంతో పాటు జిల్లాలోని పలు గిడ్డంగుల్లో నిల్వ ఉంచేందుకు చర్యలు చేపట్టారు.