ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్‌ను జయించి.. విధికి తలొంచి!

జీవితంలో అవరోధాలు ఎన్ని వచ్చినా ఎదుర్కొన్నారు. కాలం పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గుకొచ్చారు. చివరికి కరోనాను జయించారు. ఆఖరికి విధి చేతిలో ఓడిపోయారు. గుర్తు తెలియని వాహనం రూపంలో ఆ నవ దంపతులను బలితీసుకుంది. పెళ్లయిన ఆరు నెలలకే నిండు నూరేళ్లు నిండేలా చేసింది. గర్భిణి అయిన భార్యను కష్టం లేకుండా చూసుకోవాలన్న అతని తపన.. పండంటి బిడ్డను కని భర్తకు కానుక ఇవ్వాలన్న ఆమె కోరికలను చిదిమేసింది. శ్రీకాకుళం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఈ హృదయ విదారక ఘటన సోమవారం చోటుచేసుకుంది.

road accident at amadhalavalasa
road accident at amadhalavalasa

By

Published : Jun 1, 2021, 8:24 AM IST

Updated : Jun 1, 2021, 9:18 AM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చిట్టివలసకు చెందిన రౌతు యోగేశ్వరరావు(27), రోహిణి (22) ద్విచక్ర వాహనంపై విశాఖ వెళుతుండగా.. కనిమెట్ట వద్ద జాతీయ రహదారి పైవంతెనపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు విడిచారు.

కొత్తగా కాపురం

రెండేళ్ల కిందటే యోగేశ్వరరావు విశాఖలో రైల్వే కళాసీగా చేరాడు. వివాహమైన తర్వాత ఇంటి నుంచి నగరానికి రైలులో వెళ్లి వచ్చేవాడు. నిత్యం రాకపోకలు సాగించడం ఇబ్బంది కావడంతో.. రెండు నెలల క్రితమే కంచరపాలెంలో ఇల్లు అద్దెకు తీసుకొని భార్యతో అక్కడ కాపురం పెట్టాడు.

ఇద్దరికీ నాన్న ప్రేమ దూరం

రోహిణిది నరసన్నపేట. ఏడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయింది. మూడేళ్ల క్రితం యోగేశ్వరరావు తండ్రి మృతి చెందడంతో ఇద్దరూ నాన్న ప్రేమకు దూరమయ్యారు. వీరికి వారి తల్లులే అన్నీ. పెళ్లయ్యాక దాంపత్య జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో కరోనా సోకడంతో ఇద్దరూ ఇంట్లోనే ఉంటూ మందులు వాడి కోలుకున్నారు. భార్య రోహిణి నీరసంగా ఉందని చెప్పడంతో చిట్టివలసలో తల్లి వద్ద ఉంచాడు.

అంతలో ఆనందం.. ఇంతలో విషాదం

రెండు రోజుల క్రితమే భార్య గర్భిణి అని తెలిసి యోగేశ్వరరావు చాలా సంతోషించాడు. దగ్గరుండి బాగా చూసుకోవాలని విశాఖపట్నం తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజులు అక్కడే ఉంచి ఆసుపత్రిలో చూపించి, వారంలో తిరిగి వస్తానమ్మా అంటూ తల్లి దీవెనలు తీసుకొని భార్యతో కలసి ద్విచక్ర వాహనంపై ఉదయం బయలుదేరాడు. కనిమెట్ట పైవంతెన వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఆ ధాటికి పక్కనే ఉన్న డివైడర్‌ను బైక్‌ బలంగా ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రగాయాలతో దుర్మరణం చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయా అంటూ విగత జీవులపై పడి రోదించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సామాజిక ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పూసపాటిరేగ ఎస్సై జయంతి తెలిపారు.

ఇదీ చదవండి:

కృష్ణపట్నంలో పండగ వాతావరణం...ఔషధం పంపిణీకి చకచకా ఏర్పాట్లు

Last Updated : Jun 1, 2021, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details