ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహమైన నాలుగు రోజులకే నూరేళ్లు.. రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతి

New Couple : వివాహం జరిగి కనీసం వారం రోజులు కూడా గడవనే లేదు. కలిసి జీవించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలనుకున్న వారి కలలను మృత్యువు చిదిమేసింది. వివాహమైన నాలుగు రోజులకే నూతన దంపతులను రోడ్డు ప్రమాదం మింగేసింది. కలకాలం జీవిస్తారని పెళ్లి చేసిన ఇరు కుటుంబ సభ్యులు.. విగత జీవులుగా పడి ఉన్న దంపతులను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు.

New Couple Died
దంపతులు మృతి

By

Published : Feb 14, 2023, 11:55 AM IST

పెళ్లయిన నాల్గవ రోజే రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి

New Couple Died In Road Accident : ఇంటికి కట్టిన మామిడి తోరణాలు ఇంకా వాడిపోలేదు. వధూవరుల కాళ్లకు పెట్టిన పారాణీ, వారి మోహలలో పెళ్లి కల చెదరనే లేదు. వివాహనికి వచ్చిన బంధువుల నోళ్లలో వీరి పెళ్లి ప్రస్తావనే. పెళ్లికి హాజరైన వారు.. నూతన జంట గురించే ముచ్చటించుకుంటున్నారు. వివాహ జ్ఞాపకాలు, మధురానుభూతులు కుటుంబ సభ్యుల మదిలో మెదలుతునే ఉన్నాయి. వివాహమై ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్న వేళ.. వారికి తీరని దుఃఖం మిగిలింది. కొత్తగా పెళ్లైన జంట వివాహమైన నాలుగో రోజే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. రోడ్డు ప్రమాద రూపంలో నవ దంపతులను మృత్యువు కబళించింది.

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చెందిన గవలపు వేణుకు ఒడిశాలోని బరంపురానికి చెందిన ప్రవల్లికకు.. ఈ నెల 10 తేదీన సింహాచలంలో వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబ సభ్యులు వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అదివారం వరుడు వేణు ఇంట్లో వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సంతోషంగా పాల్గొన్న బంధుమిత్రులు నూతన దంపతులను చూసి మురిసిపోయారు.

ఆదివారం విందుతో పెళ్లివేడుకలు ముగిశాయి. దగ్గరి బంధువులు ఎవరి ఇళ్లకు వారు బయల్దేరారు. నూతన దంపతులు వధువు ఇంటికి బరంపురం వెళ్లారు. తిరిగి మళ్లీ ఇచ్ఛాపురం వచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. ఒడిశాలోని గోళంత్రా పరిధిలోకి రాగానే.. ట్రాక్టర్​ వీరి ద్వి చక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ట్రాక్టర్​ వేగానికి దంపతులిద్దరు ప్రమాద స్థలంలో చెల్లచెదురుగా పడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వధువు ప్రవల్లిక అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. వరుడు వేణును బరంపురం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

వివాహం జరిగిన నాలుగు రోజులకే ఇలా జరగటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారనుకున్న దంపతులు ఇలా మృత్యువాత పడ్డారని తెలియగానే వేణు కుటుంబ సభ్యులు, ప్రవల్లిక కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. దంపతుల మృతితో ఇచ్ఛాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తీరాని దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయారని వేణు తల్లి రోదిస్తున్న తీరు పలువుర్ని కంటతడి పెట్టించింది. వేణు తండ్రి గతంలో మరణించగా.. తల్లి, అన్నయ్యలతో కలిసి ఉంటున్నాడు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details