Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: 'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం దవలపేటలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పర్యటించారు. శ్రీకాకుళం చేరుకున్న ఆమెకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవళపేటకు చెందిన టీడీపీ కార్యకర్త కంచరాన అసిరి నాయుడు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.
బాధిత కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకొని మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. భువనేశ్వరి వెంట మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, నేతలు కిమిడి నాగార్జున, రాంమల్లిక్‌నాయుడు తదితరులు ఉన్నారు.
అంగన్వాడీల సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా: నారా భువనేశ్వరి టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి ఓదార్పు
అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాకు భువనేశ్వరి చేరుకున్నారు. పాలకొండ నియోజకవర్గం భామిని మండలం బిల్లమడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా బర్రి విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక విశ్వనాథం గత ఏడాది అక్టోబర్ 22వ తేదీన గుండెపోటుతో మరణించారు.
బాధిత కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కార్యకర్త కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. తెలుగుదేశం పార్టీ విశ్వనాథం కుటుంబానికి అండగా ఉంటుందని భువనేశ్వరి ధైర్యం చెప్పారు.
చంద్రబాబుకు అరెస్టుతో మద్దతు పెరిగింది - అండగా నిలబడినవారందరికి కృతజ్ఞతలు : భువనేశ్వరి
భువనేశ్వరిని కలిసిన అంగన్వాడీలు: అంతకు ముందు భువనేశ్వరిని భామిని మండలం అంగన్వాడీలు కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలతో భువనేశ్వరి మాట్లాడారు. చంద్రబాబుకు మహిళలు అంటే గౌరవం అని తెలిపిన భువనేశ్వరి, గతంలో రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడే అంగన్వాడీలకు వేతనాలు పెంచారని గుర్తు చేశారు. అంగన్వాడీ సమస్యలను తప్పకుండా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరతానని భువనేశ్వరి హామీ ఇచ్చారు.
అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. తోడవాడలో సాంబమూర్తి, దన్నానపేటలో తిరుపతిరావు, పాతనిమ్మతొర్లువాడలో పారయ్య, ఎర్రయ్య కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో 'నిజం గెలవాలి' యాత్ర ముగియడంతో, విశాఖకు బయలుదేరారు.
నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల చెక్కు అందిస్తున్నారు. బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించిన భువనేశ్వరి, నేడు శ్రీకాకుళం జిల్లాలో యాత్ర జరిగింది. 5వ తేదీన విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటిస్తారు.