TDP spokesperson Nannuri Narsireddy: స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హతలపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ్మినేని విద్యార్హతలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని తెలంగాణకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. తమ్మినేని వెల్లడించిన విద్యార్హతలకూ వాస్తవ అర్హతలకు ఏమాత్రం పొంతన లేదంటూ విమర్శించారు. నకిలీ సర్టిఫికెట్లు పెట్టి పలు ఇంటర్వూల్లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని చెప్పిన తమ్మినేని సీతారాంకు డిగ్రీ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్శిటీలో అడ్మిషన్ తీసుకునే సమయంలో తమ్మినేని సీతారాం ఏయే పత్రాలు ఇచ్చారో చెప్పాలని ఉప కులపతిని కోరామన్నారు. 2015-18 నాగర్‌కర్నూల్ స్టడీ సెంటర్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందినట్లు పేపర్లు ఓయూ అధికారులు ఇచ్చారని నర్సిరెడ్డి వెల్లడించారు.
నాగర్‌కర్నూల్ స్టడీ సెంటర్‌కు వెళ్లి కనుక్కుంటే తమ్మినేని సీతారాం చదవలేదని తేలిందని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తమ్మినేని సీతారాం చెప్పాలని డిమాండ్ చేశారు. జిరాక్స్ ప్రతులు పెట్టి ఎలా అడ్మిషన్ పొందారని నిలదీశారు. సర్టిఫికెట్లతో మంత్రికి ఎం లాభం అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు... ఆ విషయాన్ని తమ్మినేని సీతారాంనే అడగాలని నర్సిరెడ్డి పేర్కొన్నారు. అసలు ఈ సర్టిఫికెట్ ఎందుకో అనేది మీడియా తమ్మినేని సీతారాంనే అడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడిచారు. ఆయన విద్యార్హతపై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించామని వెల్లడించారు. ఓయూ అధికారులు ఇచ్చిన వివరాలతో పాటుగా నాగర్‌కర్నూల్ స్టడీ సెంటర్‌లో సేకరించిన వివరాలను పరిశీలించి ఈ ఆరోపణలు చేస్తున్నట్లు నర్సిరెడ్డి పేర్కొన్నారు.