ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇచ్ఛాపురం, పాలకొండ ఛైర్​పర్సన్లు ఖరారు! - ఇచ్ఛాపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజలక్ష్మి వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో మూడు పట్టణాల్లో పుర ఎన్నికలు జరిగాయి. అన్నిచోట్లా వైకాపాకే ప్రజలు పట్టం కట్టారు. గురువారం ఛైర్మన్‌ ఎన్నిక జరగనుంది. అయితే బుధవారం రాత్రి వరకూ అధ్యక్షులుగా ఎవరనే ఉత్కంఠ మాత్రం కొనసాగింది. చివరికి పాలకొండ, ఇచ్ఛాపురం పీఠాలపై స్పష్టత వచ్చినా పలాస-కాశీబుగ్గ పురపాలికపై మాత్రం రాలేదు. దీంతో ఆశావహుల్లో ఏం జరుగుతుందోననే ఆసక్తి రేగుతోంది. ఇక్కడ తొలుత ఒకరిని ప్రకటించినట్లు సమాచారం వచ్చినా సాయంత్రానికి కాదంటూ ఆపార్టీ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.

ఇచ్ఛాపురం, పాలకొండ ఛైర్​పర్సన్లుగా రాజలక్ష్మి, రాధాకుమారి
ఇచ్ఛాపురం, పాలకొండ ఛైర్​పర్సన్లుగా రాజలక్ష్మి, రాధాకుమారి

By

Published : Mar 18, 2021, 10:39 AM IST

మూడు పట్టణాల్లో గురువారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్న నేపథ్యంలో అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అక్షర వరస క్రమం ఆధారంగా ఈ ప్రక్రియ సాగుతుంది. అది పూర్తయిన తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు సంబంధించి చేతులు ఎత్తి ఎన్నుకుంటారు. ఎక్స్‌అఫీషియో హోదాలో ఆయా చోట్ల స్థానిక శాసనసభ్యులు, ఎంపీ పాల్గొంటారు.

తొలి నుంచీ ఆమె పేరే

పాలకొండ నగర పంచాయతీ రెండో అధ్యక్షురాలిగా యందవ రాధాకుమారిని వైకాపా నాయకులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ నాయకులు, కౌన్సిలర్లుగా ఎన్నికైనవారంతా బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఛైర్‌పర్సన్‌గా రాధాకుమారిని, ఉపాధ్యక్షులుగా రౌతు హనుమంతురావును ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ పార్టీ అధిష్ఠానానికి సమాచారం పంపినట్లు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలిపారు. ఎన్నికలకు ముందే స్థానిక నాయకులంతా అధ్యక్షురాలిగా రాధాకుమారి పేరునే ప్రకటించారు. చివరి వరకూ అదే మాటపై ఉన్నారు. ఈ నేపథ్యంలో నగర పంచాయతీ రెండో పాలకవర్గంలో అధ్యక్ష పీఠం ఎవరిదనేది స్పష్టత వచ్చేసింది. ఇప్పటికే సమావేశ మందిరంలో సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇక్కడ 20 మంది కౌన్సిలర్లుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

రెండోసారి వరించిన అదృష్టం

ఇచ్ఛాపురం పురపాలక సంఘ ఛైర్‌పర్సన్‌గా పిలక రాజలక్ష్మిని ఎంపిక చేసినట్లు వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ప్రకటించారు. గత పాలకవర్గానికీ ఈమే ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. బుధవారం పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన సమాచారాన్ని కౌన్సిలర్లు, ఇతర నాయకులకు వివరించారు. అధ్యక్షురాలిగా పిలక రాజలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా ఉలాల భారతిదివ్య పేర్లను వెల్లడించారు. నేడు జరిగే ఎన్నికలో వీరికే మద్దతు పలకాలని ఇతర సభ్యులకు విప్‌ జారీచేశారు. పుర కార్యాలయానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలని పార్టీ నాయకులు, శ్రేణులను సాయిరాజ్‌ కోరారు. ఇక్కడ 23 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 15 మంది వైకాపా తరఫున గెలిచారు. తెదేపా ఆరు స్థానాలతో సరిపెట్టుకుంది. స్వతంత్రులుగా ఇద్దరు విజయం సాధించారు. వీరు కూడా వైకాపాకే మద్దతు తెలియజేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ హాజరుకానున్నారు.

ఆ ఇద్దరిలో ఎవరో..!

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో ఛైర్మన్‌ కుర్చీలో కూర్చునేవారి పేరు విషయంలో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని మిగిలిన చోట్ల అభ్యర్థుల పేర్లను నాయకులు ప్రకటించారు. కానీ ఇక్కడ మాత్రం ఛైర్మన్‌ అభ్యర్థి పేరు ప్రకటించకపోవటం స్థానికంగా చర్చనీయాంశమైంది. జంట పట్టణాల్లో బుధవారం రాత్రి పలు మాధ్యమాల్లో పలాసకు చెందిన బళ్ల గిరిబాబు పేరు ఖరారైందని జోరుగా ప్రచారం సాగింది. దీంతో అతని వర్గీయులంతా బాణసంచా కాల్చి సందడి చేశారు. కాసేపటికే మున్సిపల్‌ పీఠంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని, ఛైర్మన్‌ ఎంపిక గురువారం ఉదయం 8 గంటలకు అధిష్ఠానం ప్రకటిస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు కార్యాలయం పేరిట ప్రకటన విడుదలైంది. దీంతో మళ్లీ జంట పట్టణాల్లో ఉత్కంఠ నెలకొంది. ఛైర్మన్‌ రేసులో పలాస నుంచి బళ్ల గిరిబాబు, కాశీబుగ్గ నుంచి దువ్వాడ శ్రీకాంత్‌ పోటీపడుతుండటంతో ఛైర్మన్‌ పదవి ఎవరిని వరిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి:

నగర, పురపాలికల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు

ABOUT THE AUTHOR

...view details