తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికలు పూర్తయ్యాక ఏప్రిల్, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని తమ పార్టీ విశ్వసిస్తోందని రాజ్యసభ సభ్యుడు, వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో జులై 8న వైకాపా ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు.
అర్హత ఉన్న ప్రతి పార్టీకీ కేంద్ర కార్యాలయం కోసం 4 ఎకరాలు, జిల్లా కార్యాలయం కోసం 2 ఎకరాల చొప్పున కేటాయించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిబంధనలకు అనుగుణంగా స్థలాల కేటాయింపులు పూర్తయ్యాక త్వరలో 13 జిల్లాల్లో పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నాం. అన్ని హంగులు, సకల సౌకర్యాలతో పార్టీ కార్యాలయాలు నిర్మించే బాధ్యతలను ఎంపీ అయోధ్య రామిరెడ్డికి అప్పగించాం. పార్టీపరంగా ప్రస్తుతం ఉన్న కమిటీలన్నీ రద్దవుతాయి. ప్లీనరీలో పునర్నియామకాలు ఉంటాయి. అన్ని కులాలు, మతాలనూ సమానంగా చూడాలనేదే ముఖ్యమంత్రి జగన్ అభిమతం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ పథకాలనూ సకాలంలో అందిస్తూ, అన్ని వర్గాలకూ చేరువయ్యాం. కాబట్టి గెలుపు మనవైపే ఉంటుంది. నిరుద్యోగ సమస్య తీర్చేందుకు త్వరలో ఉద్యోగమేళా నిర్వహించే ఆలోచన ఉంది. అన్ని రంగాల్లో ఓటమి చెందిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు కలిసి ఇప్పుడు దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారు. వాటిని మాపై రుద్దుతూ అసత్య ప్రచారానికి పూనుకున్నారు. రామతీర్థంలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం. ఆధారాలు లేకపోవచ్చు కానీ.. దేవుడు అన్నీ చూస్తున్నాడు. వారిని ఆ వేంకటేశ్వరస్వామే శిక్షిస్తారు- విజయసాయి, రాజ్యసభ సభ్యుడు