రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధివిధానాలపై శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత నివాసంలో ఏర్పాటు చేసిన శుభకార్యానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసులపై చూపుతున్న శ్రద్ధను ప్రభుత్వ పాలనపై పెడితే ఎంత బాగుంటుందో అని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు, గ్యాస్, కూరగాయలు, పెట్రోల్ , డీజిల్‌తో పాటు వివిధ ఉత్పత్తులు అధికంగా పెంచుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
'కేసులపై చూపుతున్న శ్రద్ధ.. పాలనపై పెడితే ఎంత బాగుండో.. '
ముఖ్యమంత్రి జగన్ కేసులపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టిపెట్టాలని.. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు హితవు పలికారు. నిత్యవసర వస్తువుల ధరతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆముదాలవలస అభివృద్ధిపై వైకాపా నాయకులెవరైనా చర్చకు రావాలని.. సవాల్ విసిరారు.
ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పిలుపు మేరకు రాష్ట్రంలో ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చేయకపోవడం విచారకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, తెదేపా నాయకులు విద్యాసాగర్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.