మనకు దెబ్బ తగిలితే నొప్పి మాత్రమే. కానీ.. మనవాళ్లకు మాత్రం నరకం. అలాంటిది.. కన్నకొడుకు కళ్లముందే ప్రాణాలు కోల్పోతే.. ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం. ఇలాంటి దారుణ పరిస్థితి ఎదురైంది సిక్కోలు తల్లికి!
శ్రీకాకుళం జిల్లా.. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన వలసకూలీ గేదెల మోహనరావు (24).. విశాఖపట్నంలో భవన నిర్మాణ పనులు చేస్తూ తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఈనెల 10వ తేదీన ఓ భవనంపై పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడిపోయాడు. ఈ దుర్ఘటనలో మోహనరావు తీవ్రంగా గాయపడ్డాడు. తలకు, శరీర బాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. అయితే.. మూడు రోజులపాటు చావుతో పోరాడిన మోహనరావు.. శనివారం ఓడిపోయాడు. తల్లిని ఒంటరిని చేస్తూ వెళ్లిపోయాడు.
కాపుదోగాయవలస గ్రామానికి చెందిన ఢిల్లెమ్మ భర్త 20 ఏళ్ల క్రితమే కన్నుమూశాడు. అనారోగ్యంతో భర్త దూరమయ్యే నాటికి.. కొడుకు మోహనరావు వయసు ఐదేళ్లు. అప్పటి నుంచి కొడుకే ప్రపంచంగా బతుకుతోంది ఆ తల్లి. ఎన్నో కష్టనష్టాలకోర్చి కొడుకును పెంచి పెద్ద చేసింది. చేతికందిన కొడుకు.. ఇంటి, తల్లి బాధ్యతను తీసుకున్నాడు. కూలీనాలి చేస్తూ తల్లిని పోషిస్తున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో.. ఊహించని విధంగా కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డ మృతిని తట్టుకోలేక ఢిల్లెమ్మ గుండెలవిసేలా రోధిస్తోంది. కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు చితికి.. తానే నిప్పు పెట్టాల్సి రావడంతో ఆమె వేదనకు అంతులేకుండా పోయింది. ఢిల్లెమ్మ పరిస్థితిని చూసి గ్రామస్తులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం భర్త.. ఇప్పుడు కుమారుడు శాశ్వతంగా దూరమవడంతో.. ఆ తల్లి ఒంటరిగా మిగిలిపోయింది.
ఇవీ చదవండి :