BUS TOUR: రాష్ట్రంలో సీఎం జగన్ సృష్టించిన సామాజిక విప్లవం దేశమంతా అవలంబించాలని.. మంత్రులు ఆకాంక్షించారు. మంత్రివర్గంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు 'సామాజిక న్యాయభేరి' పేరిట శ్రీకాకుళం నుంచి 4 రోజుల బస్సు యాత్ర ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న 17 మంది మంత్రులు తమ తమ సామాజిక వర్గాలకు వైకాపా ప్రభుత్వంలో దక్కిన ప్రాధాన్యాలను వివరిస్తామని చెప్పారు. 82 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కార్పొరేషన్లకు నిధులు ఎంత ఇచ్చారనేది ముఖ్యం కాదని, రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ముఖ్యమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
రాష్ట్రంలోని ప్రజలను చైతన్యపరిచేందుకే బస్సు యాత్ర చేపట్టామని పశుసంవర్థక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జగన్ స్ఫూర్తిని దేశంలో అందరూ పాటిస్తారని.. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడతామని తెలిపారు. జగన్ ఉద్దేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన బస్సు యాత్ర ఎచ్చెర్ల, రణస్థలం చేరుకున్న అనంతరం అక్కడ నుంచి విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ, నాతవలస, డెంకాడ వరకు బస్సు పర్యటన సాగుతోంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు విజయనగరంలో బహిరంగ సభ ఉంటుంది. తర్వాత విశాఖపట్నం బయలుదేరి వెళ్లి రాత్రి అక్కడ బస చేస్తారు.