పార్టీలకతీతంగా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు: మంత్రి ధర్మాన - నిరుపేదల పక్షపాతి
పేదలందరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నామని మంత్రి ధర్మాన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పక్షపాతి అని ఆయన పేర్కొన్నారు.
పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందచేస్తున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారి కుటుంబాలకు చేయూతనివ్వడానికి అనేక పథకాలను రూపకల్పన చేస్తున్నామని మంత్రి తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసునిగా జగన్ పేదలందరికీ పథకాలను అందిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ వాహన మిత్ర నమోదులో శ్రీకాకుళం జిల్లా 2వ స్థానంలో ఉండటం హర్షదాయకమన్నారు. ఓనర్ కమ్ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించి వారిని ఆదుకుంటున్నామన్నారు. జిల్లాలో 10,452 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. నీతివంతమైన పాలన అందిస్తున్నందున అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఈనెల 15న రైతు భరోసా క్రింద రూ.12,500లను అందించనున్నట్లు తెలిపారు.