Minister Dharmana Prasad rao: ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే ప్రజలే ఓటు ద్వారా ఎన్నికల్లో సమాధానం చెబుతారని.. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం జరిగిన మూడో విడత సున్నా వడ్డీ పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
‘ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో తెదేపా నాయకులు దిక్కుతోచక ప్రజల వద్దకు వెళ్లి మాయమాటలు చెబుతున్నారు. వైకాపా అంటే గిట్టనివారంతా ప్రజలు మోసపోతున్నారని చెబుతున్నారు. అనర్హుల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు అందడం లేదని ఊదరగొడుతున్నారు. ప్రభుత్వ పథకాలు మంచివి కావని ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే ప్రభుత్వ పధకాల లబ్ధి అందేది. జిల్లా కలెక్టర్ సైతం గ్రామాల్లో జన్మభూమి కమిటీ సభ్యులనే కలవమని చెప్పేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. అవినీతికి అస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లో నగదు జమవుతోంది’ అని అన్నారు.