Minister dharmana Comments : శ్రీకాకుళంలో ఆసరా నగదు పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ధర్మాన అసహనానికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీకి ఓట్లు వేయాలని కోరుతూ... ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలపై మహిళలకు వివరించేందుకు మంత్రి తెగ తాపత్రయ పడ్డారు.
గేటు తెరవడంతో... శ్రీకాకుళం టౌన్‌హాల్‌లో ఆసరా పథక లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగించారు. ఇటీవల నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరవుతున్న మహిళలు.. ప్రతీసారి మంత్రి ప్రసంగానికి ముందే తిరిగి వెళ్లిపోతుండటంతో అధికారులు గేట్లకు తాళాలు వేశారు. మంత్రి ధర్మాన ప్రసంగిస్తున్న సమయంలో ఓ గేటు తాళం ఎవరో తీసేయడంతో... మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన ధర్మాన... గేటు తాళాలు ఎవరూ తీశారో.. వాడి గూబ మీద ఒకటి కొట్టండి.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పథకాలు రావంటూ... జగన్మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారన్న ధర్మాన... రానున్న ఎన్నికల్లో మీ భర్తలు చెప్పినవారికి ఓటేసినా.. ఈ ప్రభుత్వం మళ్లీ రాకున్నా.. మీకు పథకాలు రావు అని చెప్పారు. ఈ ప్రభుత్వం గడువు ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వం ఉండదు.. ఆ మరుసటి రోజునే పథకాలు ఉండవు అని, పథకాలు కొనసాగవని చెప్పారు. ఇంట్లో మా ఆయన చెప్పిన పార్టీకి ఓటేస్తున్నాం.. మా పథకాలు ఇలాగే ఉంటాయి అనుకుంటే పొరపాటే అని అన్నారు. మీరు మళ్లీ అధికారం ఇస్తే పథకాలు కొనసాగుతాయి అని చెప్పారు. ఒకవేళ ఈ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మీరు భావిస్తే.. జగన్ మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వకండి. ఆయన్ను కాకుండా మరొకరిని ఎన్నుకోండి.. తప్పులేదు అని పేర్కొన్నారు.