ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన - minister dharmana
సౌడాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ధర్మాన ప్రారంభించారు. తెదేపా నేతలు రామ్మెహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం సౌడాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాసు ప్రారంభించారు. వంశధార ఎడమ ప్రధాన కాలువపై రూ.10 కోట్ల 88 లక్షల అంచనాతో గత ప్రభుత్వ హయాంలో దీన్ని నిర్మించగా పెండింగ్ పనులను ఇటీవల పూర్తి చేశారు. ప్రారంభ కార్యక్రమంలో తెదేపా లోక్సభా పక్షనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇరు పార్టీల నేతలు కార్యక్రమంలో పాల్గొంటున్నందున పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అధికార, ప్రతిపక్ష నేతలు సుహృద్భావ వాతావరణంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిపించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం సౌడాంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా 1,550 ఎకరాలకు నీరందించనున్నారు. మంత్రి వెంట వైకాపా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్ ఉన్నారు.