ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Botsa: "అచ్చెన్నాయుడును ఓడించడమే లక్ష్యంగా పని చేయాలి" - టెక్కలిలో వైకాపా సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స

Botsa Satyanarayana: మళ్లీ రాష్ట్రాన్ని ఓ బలమైన సామాజికవర్గం దోచుకునేందుకే.. అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైకాపా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న బొత్స.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నను వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఇది సీఎం జగన్‌ ఇచ్చిన టార్గెట్‌ అని శ్రేణులు, నాయకులు పోరాడి ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.

Botsa Satyanarayana
మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Jun 6, 2022, 1:10 PM IST

Botsa Satyanarayana: టెక్కలి నియోజకవర్గంలో దుష్ట దుర్మార్గ ఆలోచనలతో ఉన్న అచ్చెన్నాయుడును వ్యక్తిగతంగా ఓడించాలనేది వైకాపా అజెండా అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అదే జగన్మోహన్​రెడ్డి ఆలోచన అని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇంఛార్జి మంత్రి హోదాలో టెక్కలిలో ఆదివారం జరిగిన పార్టీ విస్తృత కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

అచ్చెన్నాయుడు... మనిషైతే పెరిగాడు గానీ.. బుర్రమాత్రం పెరగలేదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. మనిషిని చూడగానే తెలిసిపోద్దని అన్నారు. ఈ నియోజవకర్గంలో వైకాపా ఎమ్మెల్యేను గెలిపించాలని... అదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇందులో రాజీలేదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో అంతా కలిపితే 8 నుంచి 9వేల ఓట్ల తేడాతో మాత్రమే అచ్చెన్నాయుడు గెలుపొందారని... కేవలం ఐదారు వేల ఓట్లు అటుఇటు మారితే సరిపోతుందని ఈ రోజుల్లో అదేం పెద్ద వింత కాదన్నారు. దానికి పెద్దగా కష్టపడనక్కర్లేదన్నారు.

రాష్ట్రంలో పేదవాడి ఆకలిమీద పెద్దకుట్ర జరుగుతోందని ఆరోపించారు. మళ్లీ బలమైన సామాజికవర్గం దోపిడీ చేయడానికి చంద్రబాబునాయుడు పథకం ప్రకారం ముందుకొస్తున్నారని విమర్శించారు. తిండిలేకుండా అలమటించేలా ఈ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలన్నీ బూటకాలని... రోజూ పేపర్లను చూస్తూ నాలుగు టీవీలు పట్టుకుని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నేటికీ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఆయన అమలు చేసిన పథకాల గురించే ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఇన్నేళ్ల చరిత్రలో చేసిందేమిటని ప్రశ్నించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details