Millers Fraud In Grain Procurement : శ్రీకాకుళం జిల్లాలో వరి రైతులకు తిప్పలు తప్పడం లేదు. అష్టకష్టాల తర్వాత పంట చేతికి వస్తే మిల్లర్ల నిర్వాకంతో తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తేమశాతం పరీక్షించి.. బరువు వేసిన తర్వాతే మిల్లర్ల వద్దకు పంపిస్తున్నారు. దానిప్రకారమే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలి. కానీ, ఇక్కడే మిల్లర్లు రైతులను దోచేస్తున్నారు. అందరూ సిండికేట్‌గా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని తేమ శాతంలో గోల్‌మాల్ చేస్తున్నారు. తేమశాతం అధికంగా చూపించి.. తరుగు ఇవ్వనిదే ధాన్యం దించేదిలేదంటూ.. తెగేసి చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తేమశాతం ఒకలాగా మిల్లర్ల దగ్గర మరొకలా ఉండడంతో రైతులు విస్తుపోతున్నారు.
"రైతు భరోసా కేంద్రంలో తేమ శాతం చూసి ధాన్యాన్ని మిల్లుకు పంపిస్తున్నారు. మిల్లుకు వెళ్లిన తర్వాత రైతు భరోసా కేంద్రంలో చూపిన తేమ శాతం కన్నా మూడు, నాలుగు పాయింట్లు తేమ శాతాన్ని అధికంగా చూపిస్తున్నారు. దీనిలో ఎవరిది నమ్మాలి. ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యం తరుగు ఇవ్వందు అంటోది. దీంతో క్వింటాలుకు 3నుంచి 4 కిలోల వరకు ధాన్యం కోత విధిస్తున్నారు." - గంగాధర్, రైతు- శ్రీకాకుళం
"మేము ధాన్యం మిల్లుకు తీసుకుపోయే సరికి తేమ శాతం 22 నుంచి 23 చూపిస్తున్నారు. అదే ధాన్యానికి రైతు భరోసా కేంద్రంలో 14 వస్తోంది. తేమ శాతం ఎంత అధికంగా వస్తే అన్ని కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. రాజీపడి క్వింటాలుకు 2 నుంచి 3 కిలోల వరకు ధాన్యం ఇవ్వక తప్పటం లేదు." -వెంకటరమణమూర్తి, రైతు-జల్లువలస