Migratory Birds Dead: శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని తేలినీలాపురం గ్రామంలో వలస పక్షులు గత మూడు రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. పెలికాన్ (గూడబాతు) జాతికి చెందిన పక్షులు చనిపోయి చెట్ల పైనుంచి కింద పడిపోతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 30 వరకు పక్షులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీటిని గ్రామానికి దూరంగా తీసుకెళ్లి పాతిపెడుతున్నారు. ఏటా సైబీరియా ప్రాంతం నుంచి ఇక్కడికి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులు సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సంతానోత్పత్తి కోసం వస్తాయి.
అటవీశాఖ ఆధీనంలో ఉన్న సంరక్షణ కేంద్రం ఆవరణలోని చెట్లు, గ్రామ పరిసరాల్లోని చెట్ల పైనా గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తి చేస్తాయి. పెలికాన్ పక్షులే చనిపోతుండటంతో కారణాల కోసం అటవీశాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. నీటి కొంగలను వేటాడటానికి ఎరగా వేసే పేనుమందును తిని ఇవి మృతి చెందుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల చెరువుల కాలుష్యం వల్ల అవి మృతి చెందుతున్నాయా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.