ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అల్లక కేదారీశ్వరరావు. డిగ్రీ పూర్తి చేశారు. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ కూడా చేశారు. 1998లో డీఎస్సీ రాసి ఎంపిక జాబితాలోనూ నిలిచారు.. అప్పటి నుంచి ఉద్యోగం వస్తుందని ఎదురు చూసి.. చూసి.. రాకపోవడం, కుటుంబ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మానసిక స్థితి సరిగాలేక ఇలా తిరుగుతున్నారు.
ఈయన గురించి ఎందుకు చెబుతున్నట్లు అనుకుంటున్నారా..? 1998 డీఎస్సీ అభ్యర్థులను ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో అర్హుల జాబితాలో ఈయన పేరు కూడా ఉండే అవకాశముంది. ఇందుకు సంబంధించిన అంశం సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీదికి చెందిన అల్లక నీలకంఠు, అమ్మాయమ్మ కుమారుడు కేదారీశ్వరరావు. 1965లో జన్మించిన ఈయన ఉన్నత చదువులు చదివే సమయంలో భవిష్యత్తులో తప్పకుండా ఉపాధ్యాయ వృత్తిని చేపడతానని అంటుండేవారు. గురువుగా నిలవాలనేదే కోరిక. అందుకు తగ్గట్టుగానే చదువుకున్నారు. 1998లో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికయ్యారు. ఆ సమయంలో తండ్రి చనిపోగా, తల్లితో కలిసి ఉంటుండేవారు.