AMMA TEMPLE: అడిగితే వరాలిస్తాడనే నమ్మకంతో దేవునికి గుడి కట్టి పూజిస్తాం. అలాంటిది అడగకుండానే అన్నీ ఇచ్చే అమ్మకు కోవెల లేకపోతే ఎలా...? ఈ ఆలోచనకే రూపమిస్తున్నారు... శ్రీకాకుళం జిల్లాకు చెందిన సనపల శ్రావణ్‌కుమార్. కోట్లాది రూపాయల వ్యయంతో... అమ్మ దేవస్థానాన్ని ఏక క్రిష్ణశిలతో నిర్మించే పనిలో ఉన్నారాయన. కన్నవారిని కావడిలో మోసిన అలనాటి శ్రవణుడి కథను రామాయణంలో విన్నాం. అమ్మపై ప్రేమకు కొత్త అర్థాన్నిస్తున్న ఈ శ్రవణుడి కథ గురించీ తెలుసుకుందాం.
సృష్టికి మూలం అమ్మ.. ఆమెను మించిన దైవం లేదు. అమ్మ పంచే ప్రేమ ముందు సృష్టిలో ఏదీ సరితూగదు. అలాంటి అమ్మకున్న ఉన్నత స్థానాన్ని, విలువను మరింత గొప్పగా చాటి చెబుతున్నారు.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలసకు చెందిన సనపల శ్రావణ్‌కుమార్. అమ్మను మించిన దైవం లేదంటూ ఏకంగా ఆమెకు గుడికట్టాలని నిర్ణయించుకున్నారు. సాదాసీదాకు ఒక చిన్న మండపం కట్టి అందులో విగ్రహం పెట్టడం కాకుండా.. ఏకంగా కోట్లాది రూపాయల వ్యయంతో ఏకశిలతో అద్భుతంగా మందిర నిర్మాణం చేపట్టారు.
శ్రావణ్‌కుమార్ తండ్రీ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, తల్లి అనసూయాదేవి గృహిణి.. వీరికి తొలుత కవలలు జన్మించగా వారిలో ఒకరు పుట్టిన వెంటనే చనిపోగా.. మరొకరు 9వ ఏట క్యాన్సర్‌తో మృతిచెందాడు. తర్వాత పుట్టిన శ్రావణ్‌కుమార్‌ను తల్లి అల్లారుముద్దుగా పెంచింది.
శ్రావణ్‌కుమార్‌కు సైతం తల్లి అంటే ఎంతో గౌరవం, ప్రేమ. 2008లో తల్లికి శస్త్రచికిత్స వికటించి మృతిచెందడాన్ని ఆయన తట్టుకోలేపోయారు. అప్పటినుంచి ఆమె జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. హైదరాబాద్‌లో స్తిరాస్థి వ్యాపారంతో బాగా స్థిరపడిన శ్రావణ్‌కుమార్.. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటేందుకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. యాదాద్రిలో లక్ష్మీనారసింహస్వామి ఆలయ నిర్మాణపు పనుల్లో పాల్గొన్న స్తపతి బలగం చిరంజీవిని కలిసి.. సూచనలు, సలహాలు తీసుకుని సొంతూరు చీమలవలసలో 2019 మార్చి నెలలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.