కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. పలు పట్టణాల్లో పోలీసులు, అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకి రావొద్దు
లాక్డౌన్ కారణంగా ఆమదాలవలసలో దుకాణాలన్నీ పోలీసులు మూసివేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఎవరూ గుంపులుగా ఉండకూడదని సీఐ ప్రసాదరావు హెచ్చరించారు. ఉదయం 8:30 వరకు నిత్యవసర వస్తువుల కొనుగోలు నిమిత్తం ప్రజలకు వెసులుబాటు కల్పించారు. అనంతరం 9:30 గంటల తర్వాత దుకాణాలన్నీ మూసివేయాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ప్రచారం చేపట్టారు.
నిర్మానుష్యంగా మారిన శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్
ఆమదాలవలసలో ఉన్న శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ గత మూడు రోజులుగా నిర్మానుష్యంగా మారింది. జిల్లాలో అతి ప్రధానమైన రైల్వే స్టేషన్ కావటంతో రోజుకు సుమారు ఐదు లక్షల వరకు ఆదాయం వచ్చేది. అయితే కరోనా వైరస్ కారణంగా స్టేషన్ పూర్తిగా మూసివేశారు. ఈ రైల్వే కేంద్రం ద్వారా రోజుకు సుమారు 20 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారని అధికారులు తెలిపారు.