ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నమ్మించి వంచించి.. రూ. కోటికి పైగా పక్కదారి పట్టించి..! - Srikakulam District Echerla Zone Ponnada News

వారంతా అమాయకులు! ఏమీ తెలియని నిరక్షరాస్యులు! ఇదే ఆసరాగా భావించిన కొందరు నాయకులు, అధికారులు... వారిని బురిడీ కొట్టించారు. భూసేకరణలో వారికి రావాల్సిన పరిహారం నుంచి... కోటికి పైగా నొక్కేశారు. అదేమని అడిగితే.. పరిహారం రావాలంటే అధికారులకు చెల్లించాలని చెప్పారు. తీరా అదంతా మోసం అని తెలుసుకున్న బాధితులు... లబోదిబోమంటున్నారు.

నమ్మించి..కొట్టేశాడు
నమ్మించి..కొట్టేశాడు

By

Published : Dec 5, 2020, 7:40 AM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీలోని 25.40 ఎకరాల పేదల భూములను.. ఇళ్ల స్థలాల కోసం అధికారులు సేకరించారు. పొన్నాడలోని ఎస్సీలు, బీసీల పేరుతో ఉన్న మొత్తం భూమిని తీసుకున్న అధికారులు... ఎకరాకు 23 లక్షల 50 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించారు. మొత్తం 29 మంది బ్యాంకు ఖాతాల్లో 5 కోట్ల 88 లక్షలు జమచేశారు. ఇక్కడే సరిగ్గా బాధితులకు సంబంధించిన కొందరు సామాజికవర్గ పెద్దలు, దళారులు రంగంలోకి దిగారు.

ప్రభుత్వం సేకరించిన భూమిలో... కొంత భూమి చెరువు గర్భంలో పోయిందని, కొందరికి పట్టాలు దస్త్రాల్లో లేవని వారిని నమ్మించారు. కేవలం 18.5 ఎకరాలకు 18 మందికి మాత్రమే పరిహారం అందిందని చెప్పి... వచ్చిన సొమ్మును సమానంగా పంచుకోవాలని తీర్మానించారు. అధికారులకు, ఇతర పనులకు ముట్టజెప్పిన సొమ్ము పోను మిగిలింది పంచితే.... ఒక్కొక్కరికీ 14 లక్షల 50 వేలు వస్తుందని నమ్మబలికారు. అలా ఒక్కో బాధితుడి నుంచి 9 లక్షల చొప్పున కోటి రూపాయలకు పైగా పక్కదారి పట్టించారు.

మోసం జరిగిందని తెలిసిన తర్వాత సంబంధిత వ్యక్తిని ఇదేమని అడిగితే....బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దాడి చేసేందుకూ ప్రయత్నించారని బాధితులు చెబుతున్నారు. బాధితులకు అందాల్సిన పరిహారంలో మోసం జరిగిన మాట వాస్తవమే అంటున్న ఆర్డీవో... ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత బాధ్యులైన అధికారులతో పాటు మిగిలిన మధ్యవర్తులపైనా క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు. పక్కదారి పట్టిన సొమ్మును బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇవీ చదవండి:

హెపటైటిస్‌-బి బాధితులకు అందని పూర్తి స్థాయి చికిత్స

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details