Lack of Basic Facilities in ST Boys Hostel: ఒక గది, ఒక బల్బు, ఒక ఫ్యాను, ఇది శ్రీకాకుళం జిల్లాలోని కురిగాం ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం దుస్థితి. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అంత చేశాం.. ఇంత చేశాం.. అని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతుంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. సంక్షేమ వసతి గృహాల్లో కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Boys Hostel Students Facing Problems in Srikakulam: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఆంధ్ర - ఒడిశా సరిహద్దు గ్రామమైన కురిగాంలో ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం పరిస్థితి అత్యంత దీనంగా ఉంది. వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో కూలిపోయే పరిస్థితి ఉన్నా అధికారులు ఎటువంటి మరమ్మతు చేపట్టడం లేదు. భవనం పైకప్పు పెచ్చులు పడి ఇనుప ఊచలు వేలాడుతున్నాయి. స్తంభాలు కుంగిపోతూ భయపెడుతున్నాయి. మరుగుదొడ్లు ఉన్నా ఉపయోగంలో లేవు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వసతి గృహం పక్కనే ఉన్న పాఠశాల భవనంలో ఒక గదిలో విద్యార్థులకు తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. అయితే 30 మంది విద్యార్థులకు ఒక గది కేటాయించారు. అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, అక్కడే చదువుకోవడం. అది కూడా ఒక చిన్న విద్యుత్ బల్బు వెలుతురులోనే. గదిలో పేరుకి 2 పాత ఫ్యాన్లు ఉన్నా ఒకటే పని చేస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిళ్లు మరుగుదొడ్డికి వెళ్లాలన్నా చీకటిలో ఆరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి.
"ఇక్కడ గ్రామస్థులు ఎక్కువగా వలస కూలీలు కావడంతో పిల్లలని వసతి గృహాల్లో చేర్పించి వలస బాట పడుతుంటారు. అయితే వసతి గృహం పరిస్థితి దృష్ట్యా వారితో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నా ప్రభుత్వం ఎందుకు కేటాయించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. త్వరితంగా నూతన వసతి గృహాన్ని నిర్మించి,పేద విద్యార్థులను ప్రోత్సహించాలి". - స్థానికుడు