ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అట్టహాసంగా కార్తిక పౌర్ణమి వేడుకలు - ఆలయాలకు పోటెత్తిన భక్తులు - ఏపీలో అట్టహాసంగా కార్తీకమాసం రెండో సోమవారం

Karthika Masam Second Monday: కార్తీకమాసం రెండో సోమవారం, పౌర్ణమి సందర్భంగా ఏపీలోని ప్రముఖ ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజామునే ఆలయానికి తరలివచ్చిన భక్తులు.. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Karthika_Masam_Second_Monday
Karthika_Masam_Second_Monday

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 2:26 PM IST

Karthika Masam Second Monday: కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీముఖలింగం దేవాలయానికి భక్తులు తాకిడి పెరిగింది. ఆలయ పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరవకొండ పట్టణంలోని గవిమఠంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి 8.00 గంటల వరకు దీపోత్సవ కార్యక్రమాలు జరిగాయి. కార్తీకమాసం రెండో సోమవారం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి.

నదీ తీరాల్లో కార్తిక కాంతులు, భక్తి శ్రద్ధలతో దీపారాధన

తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా బాపట్లజిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

చీరాలలోని బ్రమరాంబికామల్లీశ్వరస్వామి, పేరాలలోని పునుగు రామలింగేశ్వరస్వామి దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే గరళకంఠునికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. శివ దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. మహిళలు ఆలయప్రాంగణంలో కార్తీకదీపాలు వెలిగించారు. ఆలయప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.

కార్తీకమాసం రెండో సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తణుకు అంతర్భాగం సజ్జాపురంలో వేంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో రెండో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాలాభిషేకాలు చేసి తరించారు.

కార్తిక పౌర్ణమి వేళ వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ - తెల్లవారుజాము నుంచే పుణ్య క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

స్వామివారి ఆలయానికి పురాణాల్లో త్రేతా యుగం నాటి చరిత్ర ఉంది. రావణాసురుడి సంహారానంతరం ఆ రాక్షసుడు మరణ రహస్యం శ్రీరాముడికి చెప్పడం వల్ల కలిగిన హత్యాదోష నివారణ నిమిత్తం విభీషణుడు భూలోక సంచారం చేశాడు. అలా సంచరిస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గోస్తనీ నదీ తీరంలో ఓంకార శబ్దం వినపడటంతో అక్కడ స్వామివారిని విభీషణుడు ప్రతిష్ఠించారని పురాణ కథనం.

స్వామివారిని కార్తీకమాసంలో ముఖ్యంగా సోమవారం రోజున దర్శించుకుని పూజలు చేస్తే శుభాలు జరుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. స్వామి దర్శనానంతరం మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధనలు చేసి దీప పూజలు నిర్వహించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన వివిధ శివాలయాల్లో భక్తులు కార్తీక పూజలు వైభవంగా నిర్వహించారు. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమిసందర్భంగా మహిళలు తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కర్నూలు నగరంలోని సప్తగిరి నగర్​లో ఉన్న శివాలయం ఆవరణలో మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. మాలధరించిన స్వాములు శివాలయంలో శివునికి అభిషేకం చేశారు.

ఇక్కడ శ్రీ కాళహస్తిలో, అక్కడ అరుణాచలంలో - 'ఒకటి అనేకం, అనేకం ఒకటి'

ఎన్టీఆర్ జిల్లా మైలవరం.. కార్తీక పౌర్ణమి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని స్ధానిక శివాలయంలో శివునికి పాలతో, పంచామృతంతో అభిషేకాలు చేశారు. రెండవ సోమవారం కార్తీక పౌర్ణమి సదర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా శివాలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే కనిగిరి కొండపై ఉన్న శ్రీ మార్తాండేశ్వర స్వామి దేవాలయం, పునుగోడు శివాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. దీంతో శివాలయాలలో భారీ ఎత్తున క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆయా ఆలయాల వద్ద భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.

కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి పుణ్యక్షేత్రానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించడానికి వచ్చారు. రెండవ కాశీగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహిస్తే అంతా మేలే జరుగుతుందని ప్రజల నమ్మకం. ఈరోజు భక్తులు పుష్పగిరి ఆలయానికి ఎక్కువగా రావడంతో రోడ్డుకు ఇరువైపులా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.

కార్తికమాసం తొలి సోమవారం- శివాలయాల్లో పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details