- చిన్న పల్లెటూరి నుంచి పెద్ద ప్రపంచంలోకి వచ్చారు. తొంభయ్యో పడిలో ప్రవేశించారు. ఈ ప్రస్థానంపై ఏమంటారు?
శ్రీకాకుళం జిల్లాలో మురపాక అనే చిన్న పల్లెటూరు మాది. మొదట్లో అందరిలాగే నేను కూడా- నేను, నా వాళ్లు, వారి మంచిచెడ్డల గురించి మాత్రమే పట్టించుకునేవాణ్ని. విశాఖపట్నం వచ్చిన తరువాత అనేకమందితో కలిగిన పరిచయ భాగ్యం నా దృక్పథాన్ని మార్చింది. జీవితమంటే మా ఊరు మురపాకో, విశాఖపట్నమో మాత్రమే కాదని తెలిసివచ్చింది. ఎవరి కష్టాలకైనా, సుఖాలకైనా చుట్టూ ఉన్న అనేక అంశాల ప్రభావం ఉంటుందని గ్రహించాను. ఇది నా రచనా విధానంలోనూ, కథా వస్తువు ఎంపికలోనూ మార్పులు తీసుకువచ్చిన ముఖ్యమైన మలుపు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆశించిన దానికంటే మిన్నగానే బతికాన్నేను. ప్రారంభించిన ప్రతి పనీ సంతృప్తికరంగానే సాగుతోంది. క్లుప్తంగా... ఇదీ నా జీవిత సారం!
- ఉపాధ్యాయుడిగా ఉంటూనే అక్షర యజ్ఞం చేశారు. పదవీ విరమణ తరువాత కథాయజ్ఞం ప్రారంభించారు. మొత్తం కథాసాహిత్యాన్ని ‘కథా నిలయం’ అనే గొడుగు కిందకు చేర్చాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
సాహితీ లోకం కొన్ని ప్రాంతాలను, కొందరు రచయితలను విస్మరిస్తోందనే అభిప్రాయం కొందరిలో ఉంది. కొన్ని కథా సంకలనాల్లో దక్కాల్సినవారికి స్థానం దక్కకపోవడంవల్ల ఇలాంటి అభిప్రాయం ఏర్పడి ఉండవచ్చు. సంకలనకర్తల వ్యక్తిగత ఇష్టాయిష్టాలే అందుకు కారణమని భావించేవారు. అది నిజం కాదని నా నమ్మకం. కథా సంకలనానికిగానీ, వ్యాసాల సంకలనానికిగానీ వనరు అనేదే ప్రధానం. తమకు అందుబాటులో ఉండే పత్రికలనుంచి పరిమిత సంఖ్యలోని కథలను పరిగణనలోకి తీసుకుని అందులో తాము ఉత్తమమైనవిగా భావించిన వాటిని ఎంపికచేసి సంకలనంగా రూపొంది స్తున్నారు. అంతే తప్ప కొందరిని ఉద్దేశపూర్వకంగా విస్మరించాలనే దుర్మార్గపు ఆలోచన దీని వెనుక లేదని అనిపించింది. అందుకే, మొత్తం కథలను ఓచోట చేర్చితే సాహితీ విమర్శ, కథా సంకలనాల కోసం విస్తృతమైన వనరును అందుబాటులోకి తేవచ్చునని అనిపించింది. ఆ ఆలోచన నుంచే ‘కథా నిలయం’ పుట్టింది. వయసు పరిమితుల రీత్యా నేను ఆ పనుల్లోంచి బయటికి వచ్చినప్పటికీ- ఆ బాధ్యతలు చేపట్టినవారు దాన్ని సంతృప్తికరంగానే నడుపుతున్నారు.
- మీ దృష్టిలో మంచి కథకు ఉండాల్సిన లక్షణాలేంటి?
మంచి కథకు నిర్దిష్టమైన నిర్వచనం ఇవ్వలేం. ఒకరికి తీపి ఇష్టం. మరొకరికి కారమంటే ఇష్టం. అలాగే, కథల్లో ఏది మంచిది అన్నది అభిరుచిని బట్టి మారుతుంటుంది. ఒక కథ అందరికీ నచ్చినప్పటికీ, అది మంచికథ కాకపోవచ్చు. చదువుతున్నప్పుడు అనేక కథలు మనల్ని రంజింప చేయవచ్చు. కానీ, విలువైన కథలు మాత్రం తక్కువే ఉంటాయి. నా అభిప్రాయం ప్రకారం, జీవితంలో సమస్యలను, ఆ సమస్యలకు కారణాలు తెలియజేసేది మంచికథ.
- కథకు, మంచి కథకు మధ్య తేడా ఇంత స్పష్టంగా తెలిసినందునే మీరు రాశిపరంగా తక్కువ కథలు రాశారా?
నిజమే కావొచ్చు! కొన్ని సందర్భాల్లో కథా వస్తువు అందరికీ ఉపయోగపడుతుందని తెలిసినప్పటికీ, కథను రాయలేకపోవడానికి కొన్ని కారణాలుంటాయి. నా ఆఖరి కథ అన్నెమ నాయురాలు. చాలా గొప్ప కథ. పుస్తక ముద్రణకు ఆలస్యమవుతోందని తొందరపెట్టడంతో సరిగా రాయలేకపోయాను.
- థీమ్, ప్లాట్ రెండింటికీ తేడా ఏమిటి? మీరు ఏది ముందుగా తీసుకుని కథ రాస్తారు?
థీమ్, ప్లాట్‌ల గురించి నాకు నిజంగా తెలియదు. ఏదైనా అంశాన్ని మనం పైకి చూసేది వేరు. లోతుల్లోకి వెళితే కనిపించేది వేరు. నావరకు నేను పరిపూర్ణ పరిశీలన తరవాతే కథ రాస్తాను. ఉదాహరణకు అప్పట్లో ఒక కుర్రాడు చిలకపాలెం-మురపాక మధ్య సైకిల్‌పై మనిషిని తీసుకెళ్లి, తీసుకొస్తూ డబ్బు సంపాదించేవాడు. అతణ్ని చూసి 20, 30 సైకిల్ ట్యాక్సీలు వచ్చాయి. మనుషులు నడక నుంచి వాహనాలకు అలవాటుపడ్డాక మా ఊర్లోనే ఒకరు సిటీ బస్సు పెట్టారు. దాంతో సైకిల్ ట్యాక్సీలు దెబ్బతిన్నాయి. ఆ తరువాత ఆర్టీసీ బస్సులు వచ్చాయి. ఇప్పుడు సిటీ బస్సులూ లేవు. అన్నీ ఆటోలు, మోటర్ సైకిళ్లు. అంటే, సైకిల్ ట్యాక్సీలు, సిటీ బస్సులు పోయాయని మనం బాధపడాలా? కొన్ని వృత్తులకు కూడా ఇదే వర్తిస్తుంది. కొత్తగా వచ్చినవి గుర్తించకుండా... పాతవి పోయాయని గోలపెడుతుంటాం! ఇలాంటి విస్తృతమైన చూపు, ఆలోచన ఉంటే తప్ప నేను కథ రాయలేను. నిజ జీవితంలో నేను చూసిన వ్యక్తులు, వారి స్వభావాలను నా కథలోని పాత్రల్లోకి జొప్పిస్తాను. నేను రాసిన ప్రతి కథా ఎలా పుట్టిందో రాయాలన్న ఆలోచన ఉండేది. కానీ, ఇప్పుడు వయసు మీదపడింది. రాసే శక్తిలేదు. మౌఖికంగా చెబుతూ రికార్డు చేయించే ప్రయత్నంలో ఉన్నాను. కథ, కథనం అని ఒక పుస్తకం రాశాను. సాంకేతిక పదబంధాలు లేకుండా కథకు అవసరమైన అంశాలేంటో అందులో వివరించా.
- కథ రాయాలంటే మీకు ఎలాంటి వాతావరణం ఉండాలి?
మాస్టారుగా ఉన్నప్పుడు రోజుకు 15గంటలు బడిలో, ట్యూషన్లలో పాఠాలు చెప్పేవాణ్ని. ఆ రోజుల్లో పదీ పన్నెండు కథలు రాశాను. పదవీ విరమణ తరువాత చాలా ఏళ్లు ఖాళీగానే ఉన్నాను. కానీ, ఒక్క కథ కూడా రాయలేకపోయాను. ఫలానా వాతావరణం ఉంటేనే కథ రాస్తాననేమీ కాదు. కానీ... ఒకరకమైన ఉద్వేగం ఉంటే తప్ప రాయలేను. నన్ను కదిపినదేదో ఉండాలి. కథాంశంపై సంతృప్తికరమైన స్థాయిలో అవగాహన సాధించిన తరువాతే కథ రాస్తాను. అలాగే ఫలానా తేదీకి కథ ఇవ్వాలంటూ గడువులు పెడితే నావల్ల కాదు.
- ఇతర కథా రచయితల్లో మీకు నచ్చిన కొన్ని కథలు చెప్పండి!
ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేను. ఫలానా కథ మంచిది అని నేను చెప్పవచ్చు. కానీ, ఆ కథా రచయిత నాకు సన్నిహితుడైతే... నా సమాధానంలో నిజాయతీ లోపించిందని అనుకోవచ్చు. ఫలానా రచయిత రాసిన కథల్లో బాగా నచ్చింది ఏది అని అడిగితే చెబుతాను. అల్లం శేషగిరిరావు కథల్లో ‘నరమేథం’ బాగా నచ్చింది. బలివాడ కాంతారావు కథల్లో ‘ముంగిస’ నచ్చింది. అల్లం రాజయ్య కథల్లో ‘అతడు’ మంచికథ.
- చాలామందికి కథలు రాయాలనే ఆసక్తి ఉంటుంది. కానీ, రాయలేరు. తగిన శిక్షణ లేకపోవడమే దీనికి కారణమా?
తమ అభిప్రాయాలను పాఠకులతో పంచుకోవాలనుకునే వారు కథా రచనకు ప్రయత్నిస్తారు. స్వీయప్రేరణతో రాసేవారు కొందరైతే- తాము చదివిన కథల నుంచి స్ఫూర్తి పొంది రాసేవారు మరికొందరు. తొలిదశలో ఇతరులను అనుకరించవచ్చు. ఆ తరువాత సాధన కోసం, ఒక కథను చదివి దానిని తిరగరాయవచ్చు. ఆ కథలో భాష, పాత్రల చిత్రణ, పోషణను తమదైన శైలిలో మెరుగుపరచవచ్చు. ఇలా ఎవరికి వారు కథా పద్ధతిని ఏర్పరుచుకోవచ్చు.
- కథా రచనకు మీరు ఏ విధమైన సాధన చేశారు? ఎలాంటి పద్ధతి అనుసరించారు?