బడ్జెట్‌లో 64.06 లక్షల మందికి పథకం వర్తింపజేస్తామని హామీనిచ్చి.. అమలులో మాత్రం 54 లక్షలకు కుదించారని విమర్శించారు. 15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 3 లక్షలకు తగ్గించటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుండి 13,500 రూపాయలకి బదులు కేవలం రూ.7,500 మాత్రమే చెల్లిస్తూ.. తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
రైతు రుణమాఫీ 1,50,000ను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారా.. అని తెదేపాని విమర్శించిన వైకాపా.. ఒకే విడతలో రైతు భరోసా పూర్తిచేస్తామని చెప్పి ఇప్పుడు 7,500 రూపాయలని మూడు ముక్కలు చేయడం మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు. కుల, మతాలకతీతంగా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి.. నేడు నిబంధనల పేరుతో అన్నదాతల మధ్య కులాల కుంపట్లు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నిధుల కన్నా తక్కువ ఇస్తూ.. తెదేపా కన్నా గొప్పగా చేస్తున్నామని అబద్ధాలతో ఇంకెన్నాళ్లు ప్రజలను మోసగిస్తారని కళా నిలదీశారు.