100 రోజుల వైకాపా పాలనతోనే ప్రజలు విరక్తి : కళా వెంకట్రావు వై.యస్ సీఎంగా ఉన్నప్పుడు..ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ సంపాదించిన సొమ్ము ఇప్పుడు రూ. 2 లక్షల 50 వేల కోట్లు ఉంటుందని తెదేపా రాష్ట్రఅధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం తెదేపా కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించిన అవినీతి సొమ్ము 50 వేల కోట్లు ఈ ఐదేళ్లలో రూ.2 లక్షల 50 వేల కోట్లు అయ్యిందని ఆరోపించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నుంచి తన ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకున్న ముఖ్యమంత్రి.. జగన్ ఒక్కరేనని ఎద్దేవా చేశారు. వంద రోజుల పాలనలో ప్రజలు విసిగిపోయారన్న ఆయన... కేసులు పెట్టినంత మాత్రాన తెదేపా కార్యకర్తలు భయపడరన్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేయడమే కాకుండా పులివెందుల ఫ్యాక్షనిజం చూపిస్తున్నారని విమర్శించారు. అన్న క్యాంటీన్, నిరుద్యోగ భృతి నిలిపివేసి, నిత్యం కరెంటు కోతలతో ప్రజలను క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ వంద రోజుల పాలనకే ప్రజలు విరక్తి చెందారని అన్నారు.
ఇదీ చదవండి :