జూన్ 2న శ్రీకాకుళం జిల్లాలో 17 ల్యాబ్ టెక్నీషియన్లు, 26 ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది వైద్యఆరోగ్య శాఖ. సెప్టెంబరులో నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ల కౌన్సెలింగ్‌లో ఒకటో నంబరులో ఉన్న ఓ మహిళ పేరును ఏడో నంబరులో చేర్చడంతో ఆమె కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకోలేకపోయింది. దీంతో ఆమె అప్పటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనురాధను సంప్రదించింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మొదటి స్థానానికి వచ్చిన అభ్యర్థికి తొలి అవకాశం వచ్చిందని స్పష్టం చేశారు.
అదే ప్రకటనలో ఫార్మాసిస్టుల మొదటి ప్రతిభ జాబితాలో 26వ స్థానంలో ఉన్న ఒక మహిళ పేరు రెండో జాబితా వచ్చేసరికి ఏకంగా 69వ స్థానానికి వెళ్లిపోవడంతో ఆమె ఉద్యోగం కోల్పోయారు. బాధిత మహిళ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆమె ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయాలు మంజూరు చేసే మార్కుల జాబితాల్లో విద్యార్థుల మార్కులను సీజీపీఏగా ఇస్తారు. వాటి ఆధారంగా తీసుకుంటే ఇంకొందరికి జాబితాలో చోటు దక్కేది. కాని అధికారులు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం చేశామని చెప్పడంతో తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇతర జిల్లాల్లో ఈ విధానం లేకపోయినా ఇక్కడ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.