సామాజిక దూరం పాటించడం ద్వారా ప్రాణాంతక కరోనా వైరస్‌కు కళ్లెం వేయడానికి శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా స్వచ్ఛందంగా వ్యక్తిగత నిర్బంధం పాటించారు. నిత్యం జనాలతో కిటకిటలాడే పట్టణ ప్రధాన రహదారులు, బజార్లు జనాలు లేక విలవిల్లాడాయి. బస్స్టేషన్లు, థియేటర్లు, రైల్వే స్టేషన్లు అన్నీ మూతబడ్డాయి.
నరసన్నపేట
నరసన్నపేటలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరిగింది. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు నిలిచిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం ఆలయ ప్రాంగణం బోసిపోయింది.
ఇచ్ఛాపురం
ఇచ్చాపురం పట్టణంలో ప్రధాన బస్టాండ్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు జనాలు లేక బోసిపోయాయి. దాదాపు అన్ని వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. దేవాలయాల్లో పూజలు మాత్రమే నిర్వహిస్తున్నారు. కంచిలి మండలంలోని ఆదివారం సంత మూతపడింది. వస్తుమార్పిడి పద్ధతి నుంచి కొనసాగుతున్న ఈ సంతకు ప్రస్తుతం ప్రతి ఆదివారం వేల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు.
పాలకొండ
జనతా కర్ఫ్యూ కారణంగా పాలకొండలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ప్రధాన రహదారితో పాటు వీధులు సైతం జనసంచారం కనిపించలేదు. పాలకొండ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు పహారా కాశారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ఆరా తీశారు. వీరిని పరీక్షల నిమిత్తం స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
రాజాం
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాజాం పట్టణ ప్రజలు స్వచ్ఛంద కర్ఫ్యూ నిర్వహించారు. ఉదయం నుంచే ప్రజలు బయటకు రాకుండా ఇళ్ల కే పరిమితమయ్యారు. ఇప్పటికే మండల స్థాయి అధికారులు, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బందితో పాటు గ్రామాల్లో కూడా ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన చేపట్టారు. కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. బస్ స్టేషన్లు, థియేటర్లు, బజార్లు, ప్రధాన రహదారులు, కూడలిలో జనాలు లేకపోవడం వల్ల బోసిపోయినట్లు దర్శనమిచ్చాయి.
ఇదీ చదవండి :
జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపిన కియా పరిశ్రమ