వంశధార ప్రాజెక్టు ఎడమ కాలువ కింద లక్షా 48వేల ఎకరాలు, కుడికాలువ కింద 68వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వంశధార నదిలో 19వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా ఎడమ కాల్వకు కేవలం 19వందల క్యూసెక్కులే సరఫరా అవుతోంది. అరకొర నీటితో సాగు భూములకు ఖరీఫ్ వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారిందని రైతన్నలు వాపోతున్నారు.
నరసన్నపేట, టెక్కలి డివిజన్ పరిధిలోని మండలాలకు కాలువల ద్వారా విడుదల చేస్తున్న 1900క్యూసెక్కుల నీటిలో టెక్కలి డివిజన్‌కు కేవలం 3 నుంచి 4 వందలే అధికారులు ఇవ్వగలుగుతున్నారు. నరసన్నపేట డివిజన్‌లో 98 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా టెక్కలి డివిజన్లో 50 వేలు ఆయకట్టు ఉంది. ఎగువ ప్రాంతంలో రైతులు కాలువలపై ఎక్కడికక్కడ అడ్డుకట్టవేసి నీటిని దిగువ ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. వంశధార అధికారులు కాలువల నిర్వహణ పట్టించుకోవడంలేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎగువ ప్రాంత రైతులు అడ్డుకట్టలు తొలగిస్తే దిగువ ప్రాంత గ్రామాల్లో నాట్లు వేయగలమని రైతులు చెబుతున్నారు.